Begin typing your search above and press return to search.

రామ్ గోపాల్ వర్మ తెలివే తెలివి

By:  Tupaki Desk   |   23 Oct 2018 1:30 AM GMT
రామ్ గోపాల్ వర్మ తెలివే తెలివి
X
గత దశాబ్ద కాలంలో రామ్ గోపాల్ ట్రాక్ రికార్డు ఎంత ఘోరంగా తయారైందో అందరికీ తెలిసిందే. ఆయన చివరగా తీసిన ‘ఆఫీసర్’ సినిమాకు వచ్చిన ఆదాయం థియేటర్ల రెంట్లు, ఎంటర్టైన్మెంట్ ట్యాక్సులకే సరిపోయింది. నాగార్జున లాంటి హీరో నటించిన సినిమాకు జీరో షే రావడమంటే నమ్మశక్యం కాని విషయం. ఈ పరాభవంలో మేజర్ క్రెడిట్ వర్మకే దక్కుతుందనడంలో సందేహం లేదు. వర్మ కెరీర్లో ఇంతకంటే లో పాయింట్ ఇంకోటి ఉండదేమో. ఈ దెబ్బతో ఆయన కెరీర్ ముగిసినట్లే అని కూడా జనాలు అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా తాను పక్కన పెట్టేసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరమీదికి తేవడం ద్వారా మళ్లీ జనాల దృష్టిని ఆకర్షించగలిగాడు వర్మ. నిజానికి వర్మ ఇది కాకుండా మరే సినిమా మొదలుపెట్టి ఉన్నా.. జనాలు పట్టించుకునేవాళ్లు కాదు.

వర్మ చాలా ఏళ్ల నుంచి ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెట్టలేకపోతున్నాడు. వర్మ డైహార్డ్ ఫ్యాన్స్ కూడా ఆయన్ని నమ్మడం మానేస్తున్నారు. కానీ వర్మలోని గొప్పదనం ఏంటంటే.. ఒక సినిమా చూసి ఛీకొట్టి ఇక వర్మ మారడు అన్న నైరాశ్యంలోకి వెళ్లిపోయిన వాళ్లను కూడా మళ్లీ మార్చగలడు. తన తర్వాతి సినిమాపై ఆసక్తి ప్రదర్శించేలా చేయగలడు. ఇలా గతంలో ఎన్నో సందర్భాల్లో జరిగింది. ఏ సమయంలో ఎలాంటి సినిమా మొదలుపెడితే.. జనాల దృష్టిని ఆకర్షించవచ్చో వర్మకు బాగా తెలుసు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సైతం అలాంటి ప్రాజెక్టే. ఓవైపు బాలయ్య-క్రిష్ కలిసి చేస్తున్న ‘యన్.టి.ఆర్’ పూర్తవుతున్న తరుణంలోనే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను తెరమీదికి తెచ్చాడు వర్మ. ‘యన్.టి.ఆర్’ సినిమాలో పెద్దగా డ్రామా ఏమీ ఉండదని.. వాస్తవాల్ని చాలా వరకు కప్పిపుచ్చేస్తారని.. ఎన్టీఆర్‌ ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును ఇందులో పాజిటివ్ గా చూపిస్తారని అందరికీ తెలుసు. ‘యన్.టి.ఆర్’ సినిమా చూశాక.. అసలు వాస్తవంగా ఎన్టీఆర్ జీవితంలో ఏం జరిగింది.. ఆయనెలా వెన్నుపోటుకు గురయ్యారు.. ఏ పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయారు అన్న విషయాలు తెలుసుకోవాలని జనాల్లో ఆసక్తి ఉంటుందని వర్మ గ్రహించే.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మొదలుపెట్టాడు. మొత్తానికి తన మీద జనాలు ఎంతగా నమ్మకం కోల్పోతున్నప్పటికీ.. ఎప్పట్లాగే మళ్లీ తన కొత్త సినిమా పట్ల వారి దృష్టిని మళ్లించడంలో వర్మ విజయవంతం అయ్యాడు. మరి సినిమాతో ఎలా మెప్పిస్తాడో చూడాలి.