Begin typing your search above and press return to search.

వర్మ చిచ్చు మొదలైంది

By:  Tupaki Desk   |   19 Oct 2018 7:56 AM GMT
వర్మ చిచ్చు మొదలైంది
X
అసలెందుకు సినిమాలు తీస్తాడో ఎలా విడుదల చేస్తాడో అర్థం కాని అయోమయం మధ్యే తన ఉనికిని అభిమానులను ఏదోలా కాపాడుకుంటూ వస్తున్న రామ్ గోపాల్ వర్మ అందరు అబద్దం అనుకుంటున్న నిజమైన సంచలనానికి తెరతీసాడు. కొద్దిరోజుల క్రితం ప్రకటించిన లక్ష్మిస్ ఎన్టీఆర్ తాలుకు కీలక అప్ డేట్ ను ట్వీట్ చేసిన వర్మ నిన్న చెప్పినట్టుగానే ఈ రోజు తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుని లడ్డుతో ఫోటోలకు ఫోజు కూడా ఇచ్చేసాడు.

నాస్తికుడు అయిన వర్మ ఇలా తిరుపతికి రావడం ఇదే మొదటిసారి. దీని గురించిన స్పష్టతతో పాటు లక్ష్మిస్ ఎన్టీఆర్ కు సంబంధించి చేసిన ఒక వీడియో ఏవిని ఓపెన్ ఛాలెంజ్ పేరుతో వర్మ విడుదల చేయడం ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో వర్మ చెప్పిన మాటలు చేసిన హెచ్చరిక రానున్న రోజుల్లో పుట్టబోయే సెగలు ముందే రుచి చూపిస్తోంది.

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఇస్తున్న ఘన నివాళి అని ఎవరు ఎన్ని పేర్లతో ఎన్ని రకాలుగా తీసినా పైనున్న అన్నగారి ఆశీసులు మాత్రం తమ లక్ష్మీస్ ఎన్టీఆర్ కు మాత్రమే ఉంటాయని ఇది ఓపెన్ ఛాలెంజ్ అంటూ అన్న మాటలు పరోక్షంగా బాలయ్య తీస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ ని ఉద్దేశించినవే అనిపించడం సహజం. ఎన్టీఆర్ గారి ద్వితీయ వివాహం తర్వాత జరిగిన ఘట్టాలను తీసుకుని అప్పుడు జరిగిన కీలక పరిణామాలను ప్రపంచానికి చాటి చెప్పడమే తన ఉద్దేశమని ప్రకటించి వీడియో పొడవునా ఎన్టీఆర్ గారి ఫోటోలు లక్ష్మి పార్వతితో పాటు చంద్రబాబునాయుడుతో ఉన్నవి ఎక్కువగా పెట్టడం చూస్తే ఇందులో ఏం ఉండబోతోందో వర్మ చెప్పకనే చెప్పెసినట్టే.

పైగా టైటిల్ కింద ట్యాగ్ లైన్ అసలు కథ అని పెట్టడం చూస్తే వర్మ రేపే చిచ్చు ఓ రేంజ్ లో ఉండేలా కనిపిస్తోంది. ఈ రోజు లక్ష్మి పార్వతి గారితో కలిసి మరీ ఏడుకొండల వాడిని దర్శించుకున్న వర్మ సాయంత్రం ప్రెస్ మీట్ లో ఇంకేమేం చెప్పబోతున్నాడో అనే ఆసక్తి మొదలైంది. తన సిద్ధాంతాలు వదులుకుని దైవ దర్శనం కోసం వర్మ వచ్చాడు అని చెప్పిన లక్ష్మి పార్వతి గారు ఇలా పబ్లిసిటీ కోసం ఏదైనా చేయడం కూడా వర్మ సిద్ధాంతమే అని మర్చిపోయినట్టున్నారు అంటూ సోషల్ మీడియాలో అప్పుడే చర్చ మొదలైంది.