లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎవరు వర్మా?

Fri Oct 13 2017 13:01:10 GMT+0530 (IST)

అసలు బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ జీవితంపై బయోపిక్ తీస్తున్నా అన్నప్పుడే.. దాని డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ అంటూ రూమర్ వచ్చింది. ఆ సమయంలో ఎన్టీఆర్ పై ఒక టీజర్ సాంగ్ తయారు చేయించి.. దానిని రిలీజ్ చేశాడు వర్మ. కాని బాలయ్య వర్మను ఆ సినిమా తీయమని పిలవకపోవడంతో.. తన స్టైల్ లో లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ కొత్త సినిమా స్టార్ట్ చేసేశాడు. లక్ష్మీపార్వతి యాంగిల్ లో ఎన్టీఆర్ సినిమా.. ఓ పార్టీ నాయకుడు నిర్మాత.. వర్మ దర్శకుడు.. ఇవన్నీ చూస్తుంటేనే.. ఆ సినిమా కథ ఏ యాంగిల్ లో నడుస్తుందనే విషయంలో జనాలు ఓ అంచనాకు వచ్చేశారు.

ఈ మూవీలో లక్ష్మీపార్వతి పాత్రలో వైసీపీ లీడర్ రోజా నటించనుందనే టాక్ వినిపించింది కాని.. ఇంకా ఏదీ ఖరారు కాలేదు. రాము కూడా క్యాస్టింగ్ పూర్తవ్వలేదనే చెప్పాడు. అయితే.. అసలు ఎన్టీఆర్ పాత్రకు వర్మ ఎవరిని తీసుకోనున్నాడన్నదే అతి పెద్ద ప్రశ్న. ఇప్పటివరకూ అయితే రాంగోపాల్ వర్మ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు కానీ.. ఈ పాత్రను ప్రకాష్ రాజ్ అంటూ రూమర్లు వచ్చినప్పుడు వర్మ ఖండించాడు. అయితే ఇప్పుడు మాత్రం ఆ పాత్రను మోహన్ బాబుతో చేయిస్తే బాగుంటుందని నెటిజన్లు వర్మకు సలహాలు ఇస్తున్నారు. సీనియర్ నటుడు.. విలక్షణమైన నటన.. అద్భుతమైన డైలాగ్ డెలివరీ గల మోహన్ బాబు.. ఎన్టీఆర్ పాత్రకు జీవం పోస్తాడని చాలామంది ఫీలింగ్. కాని వాస్తవానికి లక్ష్మీ పార్వతికీ.. మోహన్ బాబుకు పడదని అందరికీ తెలిసిందే. కాబట్టి మోహన్ బాబు ఆ పాత్రను ఆఫర్ చేసినా కూడా చేయకపోవచ్చనే అనుకోవాలి.