‘టైగర్ కేసీఆర్’ పై వర్మ లేటెస్ట్ అప్ డేట్

Mon Apr 22 2019 16:35:11 GMT+0530 (IST)

మొన్నటి వరకు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పద దర్శకుడిగా పేరుగాంచిన రాంగోపాల్ వర్మ ఇప్పుడు టైగర్ కేసీఆర్ సినిమాతో అంతే కాంట్రవర్సీని సృష్టిస్తున్నాడు. చాలా కాలంగా బయోపిక్ లపై పడ్డ వర్మ కేసీఆర్ రాజకీయ ఎదుగుదలను సినిమాగా తీయడానికి సంకల్పించిన సంగతి తెలిసిందే.ఈమేరకు ‘టైగర్ కేసీఆర్’ పేరుతో ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశాడు. తాజాగా ఇటీవలే పాట పాడుతూ వీడియో కూడా షేర్ చేశాడు. ఆంధ్రోడా అంటూ సాగిన పాట ఆంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసిందన్న చర్చ సాగింది.

వర్మ ఈ పాటతోపాటు ఏపీ ప్రజలకు వ్యతిరేకంగా సినిమా తీస్తున్నాడన్న వార్త ప్రచారంలోకి వచ్చింది. అయితే తాజాగా దీనిపై ట్విట్టర్ లో వర్మ వివరణ ఇచ్చాడు. తాను తీయబోయే సినిమా ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా ఉండదని.. తెలంగాణ ప్రజలను అవమాన పరిచిన కొంత మంది ఆంధ్రా నాయకులకు వ్యతిరేకంగా మాత్రమే ‘టైగర్ కేసీఆర్ ’ ఉంటుందని తెలిపారు. తెలుగు ప్రజలందరినీ కేసీఆర్ ప్రేమించారని.... ఆయన యుద్ధం తెలంగాణ ప్రజలను వెన్నుపోటు పొడిచిన ఆంధ్రా నాయకుల మీదేనని అన్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ వర్మ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.