బాబూ... వర్మ బస్తీమే సవాల్ అంటున్నారండీ

Fri May 24 2019 23:09:35 GMT+0530 (IST)

రాంగోపాల్ వర్మ... పేరు వినగానే వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్న సెన్సేషనల్ డైరెక్టరే మన కళ్ల ముందు కదులుతారు. తాను టార్గెట్ చేసిన వారిని కెలికి కెలికి మరీ హింసించే రకానికి చెందిన వర్మ... టీడీపీ అధినేత - ప్రస్తుత ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్న చంద్రబాబును కూడా అదే తరహాలో ఓ ఆటాడుకున్నారు. బాబు బామ్మర్ది నందమూరి బాలకృష్ణ.. తన తండ్రి ఎన్డీఆర్ జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్నట్లుగా ప్రకటించగానే... అందులో బాబు పాత్రను ఖచ్చితంగా మార్చేస్తారని భావించిన వర్మ ఎంట్రీ ఇచ్చేశారు. బాలయ్య  సినిమాలో మార్ఫింగ్ బయోగ్రఫీ ఉంటుందని తాను అసలు కథ తీస్తానంటూ వర్మ సంచలన ప్రకటన చేశారు.ఈ క్రమంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరిట వర్మ చిత్రం తీయడం దాని రిలీజ్‌ను ఎన్నికల కోడ్ ఏపీలో అడ్డుకోవడం తెలిసిందే. మొన్నామధ్య ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ముగిసిందని - ఇక తన చిత్రాన్ని ఏపీలో రిలీజ్ చేస్తానంటూ వర్మ బెజవాడకు వస్తే... టీడీపీ సర్కారు ఆయనను అడ్డుకుని అరెస్ట్ చేసి... దాదాపుగా బహిష్కరించేసినంత పని చేసింది. అయితే నిన్నటి ఫలితాల్లో చంద్రబాబుకు ఘోర పరాజయం ఎదురు కావడం జగన్ ఆధ్వర్యంలోని వైసీపీ విజయం సాధించడం జగన్ సీఎం కానున్న నేపథ్యంలో ఇప్పుడు వర్మ సరికొత్తగా ఎంట్రీ ఇస్తున్నారు. అంతే కాదండోయ్... బాబుకు ఏకంగా బస్తీమే సవాల్ అంటూ వర్మ సంధించిన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ గా మారిపోయింది.

సదరు ట్విట్టర్ లో ఉన్న సమాచారం ప్రకారం... ఆదివారం నాడు వర్మ బెజవాడకు వస్తున్నారట. గతంలో తాను ఎక్కడైతే ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నారో - అక్కడే పైపుల రోడ్డు వద్దే - ఎన్టీఆర్ సర్కిల్ వద్దే ఆదివారం ఆయన ప్రెస్ మీట్ నిర్వహిస్తారట. ఈ ప్రెస్ మీట్ కు మీడియా ప్రతినిధులతో పాటు ఎన్డీఆర్ నిజమైన అభిమానులు కూడా రావాలంటూ వర్మ పిలుపునిచ్చారు. ఇక ట్వీట్ చివరలో జై జగన్ అంటూ వర్మ చేసిన వ్యాఖ్యలు బట్టి చూస్తే... ఆదివారం నాటి ప్రెస్ మీట్ లో వర్మ... చంద్రబాబును కడిగిపారేయడం ఖాయంగానే కనిపిస్తోంది. అంటే... ఇప్పటికే ఓటమి బాధలో ఉన్న చంద్రబాబును వర్మ మరోమారు కెలికేస్తారన్న మాట.