దీపావళి నాడు 'లక్ష్మీ' బాంబ్ పేల్చిన వర్మ!

Thu Oct 19 2017 16:27:19 GMT+0530 (IST)

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ను తెరకెక్కించబోతున్నానని ప్రకటించినప్పటి నుంచి ఆ సినిమా పేరు నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. బాహుబలి అర్జున్ రెడ్డి సినిమాల తర్వాత విడుదలకు ముందే ఇంత క్రేజ్ సంపాదించుకున్న సినిమా మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. గతంలో వర్మ తెరకెక్కించిన రక్త చరిత్ర బెజవాడ వంగవీటి సినిమాల విడుదలకు ముందు కొన్ని వివాదాలు వచ్చినా ఈ స్థాయిలో కాంట్రవర్సీలు కామెంట్లు రాలేదు. వర్మపై టీడీపీ నేతల విమర్శలు హెచ్చరికలు.... వాటికి సోషల్ మీడియాలో వర్మ ఘాటైన రిటార్టులు....చూస్తూనే ఉన్నాం.సాధారణంగా ఎవరైనా ఏ ఏడాది దీపావళి శుభాకాంక్షలు ఆ ఏడాది చెబుతారు. కానీ విలక్షణ దర్శకుడు వర్మ మాత్రం రాబోయే ఏడాది దీపావళి శుభాకాంక్షలను ఇప్పుడే చెప్పేశాడు. తనదైన శైలిలో అభిమానులకు వర్మ...వచ్చే సంవత్సరం దీపావళి శుభాకాంక్షలు తెలిపాడు. దీపావళి పర్వదినం సందర్భంగా వర్మ 'లక్ష్మీ' బాంబ్ పేల్చాడు. ఈ దీపావళి సంగతి తనకు తెలియదని వచ్చే దీపావళికి మాత్రం ఎన్టీఆర్ ఆత్మ.... చాలా లక్ష్మీ బాంబులను పేల్చబోతోందని చెప్పాడు. దాంతోపాటు ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి లు దీపపు సమిధల మధ్య ఉన్న జిఫ్ ఇమేజ్ ను వర్మ పోస్ట్ చేశాడు.  తాను తీయబోతున్న సినిమాకు సరిగ్గా సరిపోయే జిఫ్ ఇమేజ్ ను ఓ అభిమాని పంపిందని కామెంట్ పెట్టాడు. దీపావళిని పురస్కరించుకుని వర్మ ఫేస్ బుక్ లో తాజాగా చేసిన ఈ పోస్ట్ లు  వైరల్ అయ్యాయి.

"ఎన్టీఆర్స్ లక్ష్మి బాంబ్... ఈ దీపావళి సంగతి సరే కాని వచ్చే దీపావళిలో మాత్రం ఎన్టీఆర్ గారి ఆత్మ అంటించే చాలా చాలా లక్ష్మి బాంబులు పేలబోతున్నాయి. హ్యాపీ నెక్స్ట ఇయర్స్ దివాలి" అంటూ వర్మ పోస్ట్ చేశాడు. అయితే వర్మ చెప్పినట్లు వచ్చే సంవత్సరం కాకుండా  ఈ ఏడాదే చాలామంది టీడీపీ నేతల గుండెల్లో  'లక్ష్మీ' బాంబులు పేలుతున్నాయని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కట్టప్ప స్థానంలో చంద్రబాబును....బాహుబలి స్థానంలో ఎన్టీఆర్ ను ఉంచి....బాహుబలిని కట్టప్ప చంపే ఇమేజ్ ను ఓ అభిమాని కామెంట్ చేశాడు. ఇది వర్మ అనుకుంటున్న సినిమాకు సరిగ్గా సరిపోయే ఇమేజ్ అంటూ కామెంట్ చేశాడు.