Begin typing your search above and press return to search.

వర్మ మంచు కోటని టచ్ చేశాడా?

By:  Tupaki Desk   |   13 Feb 2019 1:30 AM GMT
వర్మ మంచు కోటని టచ్ చేశాడా?
X
వాడకంలో నన్ను మించిన వాడు లేడు అని రామ్ గోపాల్ వర్మ పదే పదే నిరూపిస్తూనే ఉన్నాడు. లక్ష్మిస్ ఎన్టీఆర్ పబ్లిసిటీ విషయంలో ఎన్నడూ లేనంత ఇష్యూస్ ని తెరమీదకు తీసుకొస్తున్న వర్మ అసలు సినిమాలో మ్యాటర్ ఉందొ లేదో గ్యారెంటీగా చెప్పలేం కానీ ప్రచారం మాత్రం భేషుగ్గా ఉంది. ఎల్లుండి 9.27 ముహూర్తం ఫిక్స్ చేసి టీజర్ ని ఎన్టీఆర్ కథానాయకుడు వచ్చే 22న ట్రైలర్ ని ఏకంగా ఆ సినిమా థియేటర్లలో చూపిస్తాను కాచుకోండి అంటూ సవాల్ విసిరాడు.

ఇప్పటికే కోరుకున్న హైప్ వచ్చేసినట్టే. సోషల్ మీడియాలో దీని మీద విస్తృత చర్చ జరుగుతోంది. ఇక మరికొన్ని ఆసక్తికరమైన అప్ డేట్స్ లక్ష్మిస్ ఎన్టీఆర్ గురించి హైప్ పెంచేలా ఉన్నాయి. వాటిలో ఒకటి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మీద సెటైర్లు ఉంటాయనే టాక్. ఎన్టీఆర్ తన చరమాంకంలో అత్యంత సన్నిహితంగా ఉన్నది లక్ష్మి పార్వతి తర్వాత మోహన్ బాబుతోనే. అందుకే తన చివరి కమర్షియల్ చిత్రం మేజర్ చంద్రకాంత్ అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా లక్ష్మి ప్రసన్న బ్యానర్ లో చేసారు. అది బ్లాక్ బస్టర్ అయ్యింది.

ఈ విశేషాన్ని మోహన్ బాబు చాలా సార్లు పంచుకున్నారు. కానీ ఎన్టీఆర్ చనిపోయాక సీన్ మారింది. లక్ష్మీ పార్వతి మోహన్ బాబుల మధ్య వదిన మరిది బంధం బెడిసి కొట్టింది. ఓ సందర్భంలో ఆవిడ మోహన్ బాబు మోసగాడు అని ఇంటర్వ్యూలో అనేశారు కూడా. ఇప్పుడు వర్మ ఈ ప్రస్తావన తన సినిమాలో తెస్తున్నట్టు వినికిడి. వర్మకు మంచు ఫ్యామిలితో మంచి బాండింగ్ ఉంది. మోహన్ బాబుతో రౌడి-విష్ణుతో అనుక్షణం-మనోజ్ తో ఎటాక్ తన డైరెక్షన్ లోనే తీసాడు. ఈ ముగ్గురూ వర్మను పలు సందర్భాల్లో పొగిడారు కూడా. అలాంటిది ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ లో కౌంటర్లు వేసేలా మోహన్ బాబుని చూపిస్తాడా అంటే అనుమానమే. విడుదల అయ్యే దాకా లక్ష్మీస్ ఎన్టీఆర్ కి ఢోకా లేకుండా వర్మ పక్కా ప్లానింగ్ తో ఉన్నాడు.