వర్మ అడ్డంగా దొరికిపోయినట్లేనా?

Thu Feb 22 2018 21:00:01 GMT+0530 (IST)

గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ) పేరుతో గత నెలంతా రామ్ గోపాల్ వర్మ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో.. టీవీ ఛానెళ్లలో కొన్ని రోజుల పాటు ఎక్కడ చూసినా ఇదే చర్చ. పోర్న్ స్టార్ మియా మాల్కోవాను పెట్టి ఈ సినిమా తీయడాన్ని గొప్ప ఘనత లాగే చెప్పుకున్నాడు వర్మ. ఈ సినిమా సాధించిన సక్సెస్ గురించి కూడా కథలు కథలుగా చెప్పాడు. ఈ సినిమాకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్లతో టీవీ ఛానెల్ వేదికగా వర్మ ఎలా ఆడుకున్నాడో తెలిసిందే. ఐతే ఇప్పుడు ‘జీఎస్టీ’ వల్లే వర్మ పెద్ద చిక్కుల్లో పడేలా కనిపిస్తున్నాడు.సామాజిక ఉద్యమకారిణి దేవి.. వర్మ మీద పెట్టిన కేసులు ముందు సింపులే అనుకున్నారు కానీ.. ఇప్పుడు అవే వర్మను పెద్ద కష్టాల్లోకి నెట్టేలా కనిపిస్తున్నాయి. సైబర్ క్రైమ్ పోలీసుల విచారణకు హాజరైన వర్మ.. తాను ఈ సినిమాను యూరప్ లో తీశానని.. ఇండియాలో కాదని.. కాబట్టి ఇక్కడి చట్టాలు తనకు వర్తించవని బుకాయించే ప్రయత్నం చేశాడు. కానీ తాజా సమాచారం ఏంటంటే.. వర్మ ఈ చిత్రాన్ని హైదరాబాద్ లోని ఒక స్టార్ హోటల్లోనే తీసినట్లుగా ఆధారాలు లభించాయట. వర్మకు వ్యతిరేకంగా పని చేస్తున్న కొందరు ఈమేరకు సాక్ష్యాలు సేకరించినట్లు తెలుస్తోంది. మియా ‘జీఎస్టీ’ చిత్రీకరణ కోసమే హైదరాబాద్ వచ్చిందని.. ఒక స్టార్ హోటల్లో చిత్రీకరణ సందర్భంగా వర్మతో పాటు అతడి అసిస్టెంట్లు ఉన్న  కొన్ని మేకింగ్ ఫొటోలు కూడా బయటికి వచ్చాయని అంటున్నారు. మన చట్టాల ప్రకారం ఇండియాలో పోర్న్ మూవీ తీయడం నేరం. దీనికి శిక్ష తప్పదు. మరి వర్మ హైదరాబాద్ లోనే ‘జీఎస్టీ’ తీసినట్లు తేలితే ఆయన పరిస్థితేంటో?