Begin typing your search above and press return to search.

ప‌వ‌న్‌ ను క‌లిసింది..ప‌నిలేని లాయ‌ర్లేన‌ట‌

By:  Tupaki Desk   |   21 April 2018 7:08 AM GMT
ప‌వ‌న్‌ ను క‌లిసింది..ప‌నిలేని లాయ‌ర్లేన‌ట‌
X
జ‌న‌సేన అధినేత‌ - సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కు - వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ‌కు మ‌ధ్య మాట‌ల యుద్ధం స‌ద్దుమ‌ణిగేలా లేదు. చిత్రపరిశ్రమను - నటీనటులను - వారి కుటుంబాలను కించపరుస్తూ కొన్ని టీవీ చానళ్లు కథనాలు ప్రసారం చేస్తుంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగ‌తి తెలిసిందే. తనతల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డితోపాటు అందుకు బాధ్యులైనవారిపై మండిపడ్డారు. శుక్రవారం ఉదయం సోదరుడు నాగబాబుతో కలిసి ఫిలింనగర్‌ లోని ఫిలించాంబర్‌ కు చేరుకున్న పవన్‌ కల్యాణ్ తనపై వ్యక్తిగత దూషణలు, కుట్రలు చేస్తున్నవారిపై చర్యలు తీసుకునేదాకా అక్కడి నుంచి వెళ్లేది లేదంటూ భీష్మించుకుని కూర్చున్నారు. పవన్ నిరసన విషయం తెలిసిన అభిమానులు పెద్దఎత్తున అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. ఉదయం 11 గంటల సమయంలో ఫిలించాంబర్‌కు చేరుకున్న పవన్ మధ్యాహ్నం వరకు అక్కడే ఉన్నారు. అనంత‌రం త‌న కార్యాల‌యానికి వెళ్లి లాయ‌ర్ల‌తో భేటీ అయ్యారు.

న్యాయ‌వాదుల‌తో జరిగిన స‌మావేశంలో ఒక అమ్మాయి నడిరోడ్డు మీద బట్టలు విప్పేసిన‌పుడు బట్టలు కప్పాలి కానీ అలా చేయకుండా వీడియో తీయటం ఏంటని ప‌వ‌న్ ప్ర‌శ్నించారని జ‌న‌సేన తెలిపింది. `నాడు రామానాయుడు స్టూడియో దగ్గర బాంబు బ్లాస్ట్ జరిగి చెయ్యి తెగిపోయిన ఒక వ్యక్తి దగ్గర మైక్ పెట్టి మాట్లాడటం ఏంటి? అంతకంటే అమానవీయ వైఖరి మరొకటి ఉంటుందా? ఈ సెన్సేషనలిజం ఎందుకు` అంటూ ఆయ‌న ప్ర‌శ్నించారు. ప్ర‌స్తుతం ప్రతి ఒక్కరి ఇంట్లో టీవీ ఉందని, లైంగిక వేధింపుల గురించి ఒక్కసారి వార్తల్లో ప్రస్తావిస్తే సరిపోతుందని,అలా కాకుండా పదేపదే అదే విషయం గురించి ప్రస్తావించటం, గంటల తరబడి డిబేట్లు పెట్టడం వల్ల సమాజానికి ఏం చెప్పాలి అనుకుంటున్నారని ఆయ‌న ప్ర‌శ్నించారు. అయితే ఈ స‌మావేశంపైనే ఆర్జీవీ సెటైర్ వేశారు. ప‌వ‌న్ త‌న ఫ్యాన్స్‌తో లాయ‌ర్ల వేషం వేయించాడ‌ని వ్యాఖ్యానించారు.

ప‌వ‌న్ లాయ‌ర్ల భేటీపై ఆర్జీవీ ఒకింత ఘాటు వ్యాఖ్య‌లే చేశారు. `నాకు ఆశ్చ‌ర్యం క‌లిగించే అంశం ఏమిటంటే...లాయ‌ర్ కంటే క్ల‌యింటే ఎక్కువ‌గా మాట్లాడ‌టం ఈ వీడియోలో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇలాంటి న్యాయ‌వాదుల కంటే...మరింత ప‌ని ఉన్న‌వాళ్ల‌ను తీసుకోవ‌చ్చు క‌దా? అయినా వీళ్లు నిజంగానే న్యాయ‌వాదులా లేక‌పోతే ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు వాళ్ల ఫిల్మ్ ప్రొడ‌క్ష‌న్ గోడౌన్ నుంచి తెచ్చిన‌ లాయ‌ర్ల కోటు వేసుకున్నారా?` అంటూ ప‌వ‌న్‌ను కెలికారు. దీనిపై ప‌వ‌న్ స‌హా ఆయ‌న ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి మ‌రి.