Begin typing your search above and press return to search.

సైరాలోకి సురేందర్‌ ఎంట్రీ అలా జ‌రిగింద‌ట‌

By:  Tupaki Desk   |   19 Nov 2017 10:30 AM GMT
సైరాలోకి సురేందర్‌ ఎంట్రీ అలా జ‌రిగింద‌ట‌
X
తొమ్మిదేళ్ల గ్యాప్ త‌ర్వాత ఒక హీరో రీఎంట్రీ ఇస్తే.. ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ ఎలా ఉంటుంద‌న్న ద‌గ్గ‌ర ఉండే సందేహాలు అన్నిఇన్ని కావు. ఇలాంటివి మ‌రెవ‌రికైనా కానీ మెగాస్టార్‌కు కాద‌న్నది నిజం. ఆ వాద‌న‌ను నిజం చేస్తూ ఆయ‌న న‌టించిన 150 మూవీ ఖైదీ నెంబ‌రు 150 సాధించిన విజ‌యం అంతా ఇంతా కాదు.

ఊహించిన దాని కంటే భారీ విజ‌యాన్ని సొంతం చేసుకున్న ఖైదీ నెంబ‌రు 150 త‌ర్వాత చిరు చేసే సినిమా మీద జ‌రిగిన చ‌ర్చ అంతా ఇంతా కాదు. మొద‌ట్నించి అనుకున్న‌ట్లే ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి చారిత్ర‌క నేప‌థ్యంలో ఉన్న క‌థ‌ను ఓకే చేశారు. మ‌రి.. ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌న్న దానిపైనా చాలానే అంచ‌నాలు వినిపించాయి. అయితే.. ఎవ‌రూ ఊహించిన రీతిలో సురేంద‌ర్ రెడ్డి ఎంపిక కావ‌టం చాలామందిని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

స్టైలిష్ యాక్ష‌న్ ఎంటర్టైనర్లు.. కామెడీ ట‌చ్ ఉన్న సినిమాలు చేయ‌టంలో పేరున్న సురేంద‌ర్ కు చిరు సినిమాకు ఎంపిక చేశార‌న్న మాట చాలామందికి స‌ర్‌ప్రైజ్ కు గురి చేసింది.

సురేంద‌ర్ ఎంపిక‌కు సంబంధించిన ఆస‌క్తిక‌ర విష‌యాన్ని వెల్ల‌డించారు రామ్ చ‌ర‌ణ్‌. ఒక ఇంట‌ర్వ్యూలో ఆయ‌నీ విష‌యాన్ని చెప్పారు. సురేంద‌ర్ తో తాను చేసిన ధృవ ప్ర‌మోష‌న్ల కార‌ణంగానే సైరా ఛాన్స్ ద‌క్కింద‌ని చెప్పాలి. చెర్రీ మాట‌ల్లో చెప్పాలంటే..

"సురేంద‌ర్ తో చేసిన ధృశ ప్ర‌మోష‌న్ల కోసం అమెరికాకు వెళ్లాం. ఓ సాయంత్రం సూరితో క‌లిసి మాట్లాడుతున్న‌ప్పుడు త‌ర్వాత సినిమా గురించి అడిగాడు. నాన్న‌గారి కోసం క‌థ చేయాల‌నుకున్న‌ట్లు చెప్పాడు. అవ‌కాశం ఉందా? అని అడిగాడు. వెంట‌నే నాన్న‌కు ఫోన్ చేశా. ఆ టైంలోనే ప‌రుచూరి సోద‌రుల‌తో క‌లిసి ఉయ్యాల వాడ సినిమాకు సంబందించిన క‌థాచ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. సురేంద‌ర్ విష‌యం చెప్ప‌గానే వెంట‌నే క‌ల‌వాల‌ని చెప్పారు. వీళ్ల మ‌ధ్య మీటింగ్ ఏర్పాటు చేశా. సూరిని నాన్న ఓకే చేశారు" అంటూ అప్ప‌ట్లో జ‌రిగిన విష‌యాన్ని వెల్ల‌డించారు చెర్రీ.

సైరాను సురేంద‌ర్ టేక‌ప్ చేశాక‌.. సినిమా మ‌రో లెవ‌ల్‌ కి వెళ్లింద‌న్నారు. త‌న టీంతో కూర్చొని సూరి క‌థ‌లో చాలా మార్పులు చేశాడ‌ని.. క‌థ అద్భుతంగా వ‌చ్చింద‌ని.. ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న‌ట్లు ఉంద‌ని చ‌ర‌ణ్ చెప్పుకొచ్చారు. త‌న మాట‌ల‌తో సైరా మీద మ‌రింత ఆస‌క్తిని పెంచేలా వ్యాఖ్య‌లు చేశారు.