అక్కడ ఇద్దరం చూసుకుని షాక్ అయ్యాం : చరణ్

Thu Mar 14 2019 20:00:02 GMT+0530 (IST)

రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్ ఆర్ ఆర్' మూవీ ప్రెస్ మీట్ లో హీరో రామ్ చరణ్ మాట్లాడుతూ అసలు ఈ సినిమా ఎలా మొదలైందనే విషయాన్ని వెళ్లడించాడు. కొన్ని రోజుల క్రితం అనగానే రాజమౌళి రోజులు కాదు సంవత్సరం దాటిందని అనడంతో చరణ్ మీతో ట్రావెల్ చేస్తుంటే టైం తెలియడం లేదండీ అన్నాడు. సంవత్సరం క్రితం నేను ఊరెళ్లేందుకు ఎయిర్ పోర్ట్ కు వెళ్లేందుకు సిద్దం అవుతున్నాను. ఆ సమయంలోనే రాజమౌళి గారు ఒక సారి వచ్చి వెళ్లు అన్నాడు. మార్గం మద్యలోనే కనుక ఆయన ఇంటికి వెళ్లాను. అప్పటికే అక్కడ ఎన్టీఆర్ కింద అలా హాయిగా సేద తీరుతూ కూర్చుని ఉన్నాడు. అదేంటి తారక్ ఇక్కడ ఉన్నాడు అనుకున్నాను. తారక్ కూడా నన్ను అక్కడ చూసి షాక్ అయ్యి ఏంటి బ్రో నువ్విక్కడ అన్నాడు - నేను కూడా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అన్నాను.నేను వెళ్లగానే మీరు ఏమైనా మాట్లాడుకోవాలా - నేను బయట వెయిట్ చేస్తాను రాజమౌళి గారు అంటూ ఎన్టీఆర్ బయటకు వెళ్లబోయాడు. అప్పుడు నేనే నాకు ఇంకా టైం ఉంది - మీరు మాట్లాడండి నేను బయట వెయిట్ చేస్తాను అన్నాను. మేమిద్దరం కన్య్ఫూజన్ లో ఉన్నాం. అప్పుడే మీ ఇద్దరు ఆగండి అని రాజమౌళి గారు లోనికి తీసుకు వెళ్లారు. ఇద్దరిని కూర్చోబెట్టి సినిమాను అనౌన్స్ చేశారు. వెంటనే ఇద్దరం కూడా షాక్ అయ్యాం. ఇద్దరికి చాలా సంతోషం - ఇద్దరం ఆయన్ను గట్టిగా పట్టుకుని తప్పకుండా చేద్దాం అని చెప్పాం. ఆ క్షణాలను నేను జీవితంలో మర్చి పోలేను. ఆ క్షణంలో తీసిన ఫొటోనే మొదట బయటకు వచ్చిందని రామ్ చరణ్ తన ఆనందాన్ని పంచుకున్నాడు.