Begin typing your search above and press return to search.

రాంచరణ్ విషయంలో అంతా రివర్స్ గేర్!

By:  Tupaki Desk   |   19 Nov 2017 12:30 PM GMT
రాంచరణ్ విషయంలో అంతా రివర్స్ గేర్!
X
సాధారణంగా మనకు పొలాల వద్ద ఓ నెమలి దొరికింది అనుకోండి... మనమేదో కోడిపెట్టను పెంచుకున్నట్లుగా తెచ్చి ఇంట్లో ఉంచుకుని పెంచేసుకుంటాం అంటే కుదరదు. దానికి చట్టం ఒప్పుకోదు. నెమలి దొరికినట్లుగా జూ లేదా అటవీ శాఖాధికారులకు సమాచారం ఇచ్చి వారికి అప్పగించాలి. ఒకవేళ మనకు పెంచుకోవాలనే మోజు ఉంటే.. ముందుగా వారి అనుమతి తీసుకోవాలి. వారు అప్పుడప్పుడూ వచ్చి.. మన ఇంట్లో నెమలి క్షేమంగా ఉందో లేదా మనం మసాలా దట్టించి వండుకుని తినేశామో చెక్ చేస్తూ ఉంటారు. ఇలాంటి అనుమతులు, జూ వారిని మనం ఆశ్రయించడమూ ఇలాంటి వ్యవహారాలు వన్యప్రాణుల విషయంలో నడుస్తుంటాయి. వన్యప్రాణి అనే నిర్వచనం కిందికి వచ్చే ఏ జంతువును పెంచుకోవాలన్నా మనకు అనుమతులు తప్పనిసరి.

అయితే హీరో రాంచరణ్ విషయంలో మాత్రం అంతా రివర్స్ గేర్ లో జరుగుతోంది. మామూలుగా మనకు జంతువులను పెంచుకోవాలనే కోరిక కలిగితే.. మనం అటవీ - జూ అధికారుల్ని సంప్రదిస్తుండాలి. కానీ వారికి భారంగా మారితే.. వాటిని పెంపకం కోసం తెచ్చి రాంచరణ్ కు అప్పగిస్తూ ఉంటారట. అంటే.. జూలో ఎక్కువైపోయిన జంతువులు.. రాంచరణ్ ఇంటి పంచకు వచ్చి చేరుతూ ఉంటాయన్నమాట.

హీరో రాంచరణ్ – ఉపాసన దంపతులకు వన్యప్రాణులంటే చాలా ప్రేమ అనే సంగతి అభిమానుల్లో చాలా మందికి తెలుసు. వాళ్ల పెంపకంలో అనేక కుక్కలు - ప్రధానంగా గుర్రాలు ఇంకా అనేక ప్రాణులు జీవించేస్తూ ఉంటాయి. రాంచరణ్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన వివరాల ప్రకారం.. బ్లూ క్రాస్ పేరిట జంతువులకోసం సంస్థను నడుపుతున్న అమల.. తనవద్ద జంతువులు ఎక్కువైపోతే.. రాంచరణ్ కు కానుకగా పంపించేస్తుందిట. అలాగే.. జూ అధికారులు కూడా అప్పుడప్పుడూ కొన్ని జంతువులను పెంచుకోవాల్సిందిగా.. వాళ్లే రిక్వెస్టు చేసి.. రాంచరణ్ కు అప్పగిస్తుంటారట. ఆ కోటాలో.. రాంచరణ్ జంతుశాలలో ప్రస్తుతం ఓ ఒంటె కూడా ఉందిట.

ఇంట్లో పెంపుడు జంతువులు చాలా ఎక్కువైపోతున్నాయ్. వీటికోసం ప్రత్యేకంగా ఓ ఫాం హౌస్ తీసుకోవాలని అనిపిస్తోంది. అంటున్నాడు రాంచరణ్. ఈ లెక్కన రాంచరణ్ ఫాంహౌస్ తీసుకుంటే.. వచ్చే వాటి సంఖ్య కూడా పెరుగుతుందేమో. ఆ ఫాంహౌస్ కాస్తా.. మరో మినీ జూలాగా మారిపోతుందేమో. అన్నట్టూ మరో సంగతి.. రాంచరణ్ ఫ్యామిలీలో బర్త్ డేలు గట్రా జరిగినా కూడా.. జంతువుల్నే కానుకలుగా ఇచ్చుకుంటూ ఉంటారట.