బోయపాటి తర్వాత.. రాజమౌళికి ముందు..

Wed May 16 2018 20:00:01 GMT+0530 (IST)

‘రంగస్థలం’తో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు రామ్ చరణ్. దీని తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో అతను ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అది ప్రస్తుతం మూడో షెడ్యూల్లో ఉంది. బోయపాటి స్క్రిప్టు రాయడానికి టైం తీసుకుంటాడు కానీ.. షూటింగ్ విషయంలో ఆలస్యం చేయడు. చకచకా పని పూర్తి చేసేస్తుంటాడు. చరణ్ సినిమా విషయంలోనూ అలాగే చేస్తున్నాడట. ఈ చిత్రం ఇంకో మూడు నెలల్లోనే పూర్తయిపోతుందని సమాచారం. దీని తర్వాత చరణ్.. రాజమౌళి దర్శకత్వంలో నటించాల్సి ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఆ చిత్రం వెంటనే మొదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఏడాది చివరికి కానీ అది పట్టాలెక్కకపోవచ్చు. దీంతో బోయపాటి సినిమాకు.. రాజమౌళి మల్టీస్టారర్ కు మధ్య కొన్ని నెలల పాటు చరణ్ ఖాళీగా ఉండాల్సి రావచ్చిన తెలుస్తోంది.



ఈ ఖాళీలో మరో సినిమా చేద్దామా అన్న ఆలోచనలో చరణ్ ఉన్నట్లు తెలుస్తోంది. రాజమౌళి సినిమా మొదలైన ఏడాదిన్నర పాటు మరో సినిమా చేయడానికి అవకాశముండదు. ఆ సినిమాకే పూర్తిగా అంకితం కావాల్సి వస్తుంది. కాబట్టి కెరీర్లో బాగా గ్యాప్ వస్తుందని.. ఈ నేపథ్యంలో మధ్యలో ఉన్న ఖాళీలో వీలుంటే ఒక సినిమా చేసి.. రాజమౌళి సినిమా మీదికి వెళ్తే బాగుంటుందేమో అని చరణ్ యోచిస్తున్నాడట. ఐతే ఎవరితో సినిమా చేయాలనే విషయంలో చరణ్ క్లారిటీతో లేడు. ప్రస్తుతం అతను బోయపాటి సినిమా కోసం ఫారిన్ షెడ్యూళ్లో ఉన్నాడు. అక్కడి నుంచి ఇండియాకు వచ్చాక కొన్ని రోజుల పాటు కథలు వింటాడట. స్టార్ డైరెక్టర్లెవరూ ఖాళీ లేనట్లే కనిపిస్తోంది. చిన్న-మీడియం రేంజి డైరెక్టర్ ఎవరితోనైనా తక్కువ బడ్జెట్లో ఒక సినిమా చేయాలన్నది చరణ్ ప్లాన్ అని తెలుస్తోంది. మరి ఈ ఖాళీని ఎవరు భర్తీ చేస్తారో చూడాలి.