పవన్ వారసుడి బాధ్యత చరణ్ దే!

Thu Oct 10 2019 15:35:48 GMT+0530 (IST)

అకీరా టాలీవుడ్ ఎంట్రీ  బాధ్యతలు కొణిదెల ప్రొడక్షన్స్ అధినేత రామ్ చరణ్ పైనే ఉన్నాయా? బాబాయ్ పవన్ కళ్యాణ్ కి ఆ విషయంలో ప్రామిస్ చేసాడా? అంటే అవుననే ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్ తనయుడు అకీరా నందన్ ప్రస్తుతం నూనూగు మీసాల టీనేజీలో ఉన్నాడు ఇప్పుడు. ఇంకా పరిణతి చెందిన హీరో వయసు రాలేదు. ఇంకా చదువుకుంటున్నాడు. స్టడీ పూర్తయిన తర్వాత తన ఇష్టం మేరకు కెరీర్ ని ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారట. అది సినిమాలా?  లేక ఉన్నత విద్యకు విదేశాలు వెళ్లాలా? అన్నది త్వరలోనే డిసైడ్ అవుతుందని తెలుస్తోంది.పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్ విడిపోయినా పిల్లల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని వారి బాధ్యతల్ని నెరవేరుస్తున్నారు. ఏడాదికి ఒకసారి కుమారుడు అకీరా.. కుమార్తె ఆద్య మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వచ్చి వెళుతుంటారు. అయితే అకీరా-ఆద్యలపై మెగా ఇంట గొప్ప ప్రేమాభిమానాలు కురుస్తాయట. అందుకే అకీరా గనుక సినిమాల్లోకి రావాలనుకుంటే ఆ బాధ్యతలు మాత్రం తప్పని సరిగా రామ్ చరణ్ పైనే ఉన్నాయని ఓ రూమర్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల నేపథ్యంలో సినిమాలకు దూరమయ్యారు. మళ్లీ సినిమాల్లోకి  వస్తారా?  రారా? అన్నది సందేహామే. ప్రజలకే తన జీవితాన్ని అంకితమిస్తున్నట్లు ఎన్నోసార్లు బహిరంగ వేదికలపై పునరాద్ఘాటించిన నేపథ్యంలో పవన్ రీ ఎంట్రీ అన్నది అంత ఈజీగా జరిగేది కాదు. 

అయితే అకీరా సినిమాల్లోకి రావాలనుకుంటే మాత్రం ఆ బాధ్యతలు కొణిదెల ప్రొడక్షన్స్ అధినేత రామ్ చరణ్ తీసుకుంటాడని అంటున్నారు. బాబాయ్ మాట చరణ్ కి శాసనం. వ్యక్తిగతంగా పవన్ ని చరణ్ ఎంతో ఆభిమానిస్తారు. పవన్ లా ఉండేందుకు ఇష్టపడతాడు. అందుకే అకీరాకు చరణ్ అండ ఉంటుందని అభిమానుల్లో చర్చ సాగుతోంది. కొణిదెల కాంపౌండ్ అండ ఉంటే చాలదా! అయినా.. ఇంతకు మించి ఇంకేం కావాలి? అకీరాను హీరోగా లాంచ్ చేయడానికి!! అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అకీరాకు సంబంధించి ఏదీ అధికారిక ప్రకటన లేదు. ఇవన్నీ కేవలం అభిమానుల ఊహాగానాలు మాత్రమే. ఈ ప్రచారంపై పవన్ కానీ.. రేణూ కానీ స్వయంగా వెల్లడించాల్సి ఉంటుంది.