Begin typing your search above and press return to search.

రంగ‌స్థ‌లంలో అవి కూడా హిట్టే!

By:  Tupaki Desk   |   24 Jun 2018 4:38 PM GMT
రంగ‌స్థ‌లంలో అవి కూడా హిట్టే!
X
ఇప్ప‌టి సినిమాకు VFX ప్రాణం. సినిమా భాష‌లో చెప్పాలంటే... ట్వంటీ ఫిఫ్త్ క్రాప్ట్ అని అనొచ్చు. స్టార్ హీరోల సినిమా సీన్లు అత్యంత స‌హ‌జంగా రావ‌డానికి VFX స‌హ‌కారం వ‌ర్ణించ‌లేనిది. గ్రాండియ‌ర్ చూపించాల‌న్నా, స‌హ‌జ‌త్వం చూపించాల‌న్నా దేనికైనా వీఎఫ్ ఎక్స్ ప‌ని సులువు చేస్తుంది. ఇటీవ‌ల టాలీవుడ్ స్టార్ హీరోల సెట్ల‌కు కోట్లు కోట్లు ఖ‌ర్చు అవుతున్నాయి. పైగా వాటిని వేసేట‌పుడు ఎంతో ప‌ర్య‌వేక్ష‌ణ అవ‌స‌రం. ఒక‌ర‌కంగా చెప్పాలంటే... ఒక బిల్డింగ్ క‌ట్టినంత ప‌నే. ఇపుడు టెక్నాల‌జీ ఆ భారాన్ని చాలా త‌గ్గించింది.

మినిమ‌మ్ సెట్టింగ్స్ వేసుకుని బ్లూమాట్‌ లో కొన్ని షాట్స్ తీసుకుని VFX లో చాలా అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఇవి ఎంత స‌హ‌జంగా ఉంటున్నాయంటే ఏ సీన్‌లో గ్రాఫిక్స్ ఉందో క‌నిపెట్ట‌డం క‌ష్ట‌మే. మీరు రంగ‌స్థ‌లం చూసే ఉంటారుగా... అందులో రంగ‌మ్మ‌త్త‌- చిట్టిబాబు బోటు సీను బాగా పేలింది. ఆ సినిమా ఏ గోదావ‌రి జిల్లాల్లోనూ తీసి ఉంటార‌ని చాలామంది అనుకున్నారు. కానీ అది ఒక చిన్న సెట్ వేసి తీసి గ్రాఫిక్స్‌లో మేనేజ్ చేశారు. అంతేనా... చాలా సాధార‌ణంగా, స‌హ‌జంగా అనిపించి రాంచ‌ర‌ణ్ ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్‌కు కూడా గ్రాఫిక్స్ వాడారంటే అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. అరే ... చక్క‌టి ప్ర‌కృతి సీన్లు భ‌లే టైమింగ్‌తో తీశారే... ఎన్ని షాట్లుప‌డ్డాయో చాలా బాగా వ‌చ్చింద‌ని అంద‌రూ అనుకుంటే... అది చాలా వ‌ర‌కు గ్రాఫిక్స్ అట‌.

ఇంత‌కీ ఈ విష‌యాలు గాసిప్స్‌లా బ‌య‌ట‌కు వ‌చ్చిన‌వి కాదు...తాజాగా రంగస్థలం విజువల్ ఎఫెక్ట్స్ పై ఒక వీడియో రిలీజ్ చేశారు నిర్మాతలు. అందులో ఈ రెండు సీన్లు గ్రాఫిక్స్‌పై ఎక్కువ‌గా ఆధార‌ప‌డిన‌ట్లు వెల్ల‌డ‌య్యింది. ఇండ‌స్ట్రీని మ‌ళ్లీ ప‌ల్లె వైపు తీసుకెళ్లిన ఈ సినిమాలో VFX ఎంత కీల‌క పాత్ర పోషించిందో అర్థ‌మైందిగా!