చిరు 152.. చరణ్ కామియో

Mon Dec 17 2018 09:56:11 GMT+0530 (IST)

అపజయం ఎరుగని దర్శకధీరుడిగా ఎస్.ఎస్.రాజమౌళి వెలిగిపోతుంటే - ఆ తర్వాత అతడి బాటలోనే అసలు అపజయం అన్నదే ఎరుగని వాడిగా కెరీర్ ని నిర్మించుకుంటూ ముందుకు సాగుతున్నాడు కొరటాల శివ. అతడు తెరకెక్కించిన ఒక్కో సినిమా తన గ్రాఫ్ ని పెంచుతున్నాయే కానీ తగ్గించడం లేదు. ప్రభాస్ - మహేష్ - ఎన్టీఆర్ లతో సినిమాలు చేసి వాళ్లకు కెరీర్ బెస్ట్ హిట్స్ ని ఇచ్చాడు. గత చిత్రం `భరత్ అనే నేను` మహేష్ కెరీర్ బెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు టాలీవుడ్ అగ్రకథానాయకుడు - బాక్సాఫీస్ బాద్ షా మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. చిరు నటిస్తున్న 152వ సినిమా ఇది. సైరా- నరసింహారెడ్డి వచ్చే సమ్మర్ లో రిలీజ్ కానుంది కాబట్టి.. ఆ సినిమా రిలీజ్ కి సమీపిస్తున్న సందర్భంలో కొరటాలతో భారీ ప్రాజెక్టును ప్రారంభించేందుకు మెగాస్టార్ సన్నాహకాల్లో ఉన్నారని తెలుస్తోంది.మెగాస్టార్ ని కొరటాల ఈ చిత్రంలో ఓ కొత్త పంథాలో చూపించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఎంచుకున్న కథాంశంలో రైతాంగం పైనా ఆసక్తికర  పాయింట్ ఉంటుంది.. అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. వీటితో పాటే కొరటాల గత చిత్రాల తరహాలోనే చక్కని సామాజిక సందేశం ఉంటుంది. చిరు పెద్దరికానికి తగ్గట్టే క్లాస్సీ రోల్ ని డిజైన్ చేశారట కొరటాల. ఇప్పటికే  ఫైనల్ వెర్షన్ స్క్రిప్టు రెడీ చేసుకుని అన్నయ్యకు వినిపించేందుకు రెడీ అవుతున్నాడని తెలిసింది.

ఈ సినిమాకి సంబంధించిన వేరొక ఆసక్తికర సమాచారం తాజాగా కొణిదెల కాంపౌండ్ నుంచి లీకైంది. ఈ సినిమాలో బాస్ తో పాటు చిన్న బాస్ రామ్ చరణ్ కొన్ని ఫ్రేముల్లో తళుక్కున మెరుస్తారట. చరణ్ కామియో స్క్రిప్టులో ఉందన్న మాటా వినిపిస్తోంది. దీంతో చిన్న బాసు పెద్ద బాస్ కి గిఫ్ట్ ఇస్తున్నారా? అన్న ఆసక్తికర చర్చ సాగుతోంది. రామ్ చరణ్ `మగధీర` చిత్రంలో చిరు కామియో పాత్రలో మెరిపించిన సంగతి తెలిసిందే. బంగారు కోడి పెట్ట.. అంటూ చిరు-చరణ్ డ్యాన్స్ ఫ్లోర్ ని దడదడలాడించారు. ఇప్పుడు కూడా మరోసారి సేమ్ సీన్ రిపీటయ్యే ఛాన్సుంటుందని మెగాభిమానులు అంచనా వేస్తున్నారు. 2019 లో కొత్త ప్రాజెక్టుకు ఠెంకాయ కొట్టే ప్లాన్ లో ఉన్నారు కాబట్టి ఇది మెగా ఫ్యాన్స్ కి శుభవార్తనే.