పిక్ టాక్: తారక్ - చరణ్ కడుపు నింపేశారే

Sun May 20 2018 17:54:27 GMT+0530 (IST)

ఇటీవల తెలుగు స్టార్ హీరోలందరూ చాలా సఖ్యతతో మెలుగుతుండటంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇంతకుముందులా ఒకరితో ఒకరు అంటీ ముట్టనట్లు వ్యవహరించట్లేదు. ఒకరి గురించి ఒకరు సానుకూలంగా మాట్లాడుతున్నారు. తరచుగా కలుస్తున్నారు. ఆ కలయికల గురించి బహిరంగ పరచడానికీ వెనుకాడట్లేదు. గత ఏడాది ‘జై లవకుశ’ విడుదల సమయంలో ఎన్టీఆర్ ను రామ్ చరణ్ కలిసి చాలా ఆత్మీయంగా ఫొటో దిగడం ఆసక్తి రేకెత్తించింది. ఆ తర్వాత వీళ్లిద్దరూ రాజమౌళితో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. మరో సందర్భంలో చరణ్-మహేష్ కుటుంబాలు కలిసి ఉన్న ఫొటో ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఇక ఇటీవలే ‘భరత్ అనే నేను’ రిలీజ్ టైంలో మహేష్-ఎన్టీఆర్-చరణ్ కలయిక ఆసక్తి రేపింది.ఇప్పుడు ఎన్టీఆర్-చరణ్ మరో ఆత్మీయ కలయికతో అభిమానుల్ని మురిపించారు.ఆదివారం ఎన్టీఆర్ పుట్టిన రోజు నేపథ్యంలో అతడికి శుభాకాంక్షలు తెలుపుతూ.. ఇద్దరూ కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు రామ్ చరణ్. ‘బ్రదర్.. హ్యాపీ బర్త్ డే.. అద్భుతమైన సంవత్సరం నీ ముందుంది’ అని ట్వీట్‌లో పేర్కొన్నాడు మెగా పవర్ స్టార్. చరణ్ సతీమణి ఉపాసన ట్విట్టర్‌లో అదే ఫోటో షేర్ చేస్తూ.. ‘‘ఈ ఇద్దరి బంధం ఎంతో దృఢమైంది.. హ్యాపీ బర్త్ డే తారక్..’’ అని ట్వీట్ చేసింది. ఇక త్వరలో రాజమౌళి దర్శకత్వంలో తెరెక్కనున్న మల్టీస్టారర్ సినిమాలో రామ్ చరణ్ ఎన్టీఆర్ నంటించనున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా మొదలుపెట్టడానికి ముందు వీళ్లిద్దరూ ఇంత ఆత్మీయంగా మెలగడం అభిమానులకు అమితానందాన్నిస్తోంది.