సుక్కుకు మరో అవకాశం ఇచ్చిన చెర్రీ

Tue Mar 13 2018 12:52:19 GMT+0530 (IST)


ఒక్కోసారి సినిమా సూపర్ హిట్ అయితే ప్రొడక్షన్ బ్యానర్లు ఆ డైరెక్టర్ కు లేదా హీరోకు బోలెడు ఆఫర్లు ఇస్తారు. ఒకవేళ హీరోకి సొంతంగా ఒక ప్రొడక్షన్ బ్యానర్ ఉంటే హీరోలే డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తారు. కానీ సినిమా ఇంకా విడుదల అవ్వకముందే రామ్ చరణ్ తన దర్శకుడు సుకుమార్ కు మరొక అవకాశం ఇచ్చేశాడంట.మెగా పవర్ స్టార్ సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమా తీసిన సంగతి తెలిసిందే. బోలెడు అంచనాలున్న ఈ సినిమా ఈ నెలాఖరున మన ముందుకు రాబోతోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న రామ్ చరణ్.. ఎన్టీఆర్ తో కలిసి వారిరువురు రాజమౌళి దర్శకత్వంలో చేయనున్న మల్టిస్టారర్ సినిమాకోసం టెస్ట్ షూట్ మరియు ఇతర పనుల కోసం లాస్ ఏంజెలెస్ కు వెళ్లారు. మరొక రెండు రోజుల్లో ఆ పనులు చూసుకుని వచ్చాక చెర్రీ రంగస్థలం ప్రోమోషన్లపై దృష్టి పెట్టనున్నాడంట. తాజా సమాచారం ప్రకారం రంగస్థలం ఔట్పుట్ ఒక రేంజులో నచ్చేయడంతో.. సుక్కుకు తన ప్రొడక్షన్ బ్యానర్ అయిన కొణిదెల ప్రొడక్షన్స్ తరపున మరో సినిమా అవకాశం ఇచ్చాడట చరణ్. దీనికై కొణిదెల బ్యానర్ సుకుమార్ కు కొంత మొత్తం అడ్వాన్స్ కూడా ఇచ్చిందట.

కాకపోతే ఇంతకుముందే ఉన్న కమిట్మెంట్స్ వల్ల సుకుమార్ ఈ సినిమాను అప్పుడే చెయ్యలేడంట. కొన్నాళ్ల తర్వాతే మొదలు పెడతాడట. కానీ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో మరొక సినిమా చేసే అవకాశం వచ్చినందుకు ఈ 'ఆర్య' డైరెక్టర్ చాలా సంతోషంగా ఉన్నాడని టాక్. అన్నీ బాగా కుదిరితే  సుకుమార్ దర్శకత్వంలో చిరంజీవితో సినిమా చేయించడానికి రామ్ చరణ్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.