ఫోటో స్టోరి: హాటీస్ నాటీ ఛాలెంజ్

Tue Mar 26 2019 23:00:01 GMT+0530 (IST)

నాజూకు భామల జిమ్ము కష్టాల గురించి నిరంతరం యువతరంలో చర్చ సాగుతూ ఉంటుంది. సన్నజాజి సోయగంలాగా.. మరు మల్లె తీగ లాగా మెరవాలంటే ఆ మాత్రం కష్టం తప్పదు అంటూ ముక్తాయించేస్తుంటారు. అయితే ఇటీవలి కాలంలో పలువురు టాలీవుడ్ టాప్ హీరోయిన్లు శరీరాన్ని విల్లులా వంచేస్తూ అభిమానులకు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. యోగా.. ఏరోబిక్స్ మిక్స్ చేసిన జిమ్మింగ్ లో ఆరితేరిపోయిన సదరు భామలు ఇప్పుడు యువతరంపై కొత్త ఛాలెంజ్ లు విసురుతూ విస్తుపోయేలా చేస్తున్నారు.ఐస్ బకెట్ ఛాలెంజ్.. సెల్ఫీ ఛాలెంజ్ .. కికీ ఛాలెంజ్.. డ్యాన్సింగ్ ఛాలెంజ్ అంటూ నిరంతరం యాక్టివ్ గా ఉండే మన అందాల కథానాయికలు లేటెస్టుగా `స్ట్రెచ్ ఛాలెంజ్` అంటూ కొత్త ఛాలెంజ్ ని తలకెత్తుకున్నారు. కాళ్లను రెండు వైపులా 90 డిగ్రీల కోణంలో చాచి నిలకడగా కొన్ని నిమిషాల పాటు అలానే ఉండడం ఈ ఛాలెంజ్ లో ఎంతో కీలకం. అయితే ఇలాంటి ఛాలెంజ్ లు స్వీకరించాలంటే నిపుణులైన శిక్షకులు అత్యవసరం. అలా ట్రైనర్లు లేకుండా ఇలాంటి ఫీట్లు వేశారో ఎముకలు విరగడం ఖాయం. కీళ్లు - నరాలు పట్టేసి అటుపై డాక్టర్ల  చుట్టూ తిరగాలి. అందుకే ఇలాంటివి చూసి ఆస్వాధించాలి. అనవసరమైన ప్రయత్నాలు వద్దు అని సూచిస్తున్నారు.

స్ట్రెచ్ ఛాలెంజ్ ప్రస్తుతం మన అందాల కథానాయికల్లో జోరుగా వైరల్ అవుతోంది. పంజాబీ బొమ్మ రకుల్ ప్రీత్ సింగ్ ఈ ఛాలెంజ్ ని స్వీకరించడంతో అసలు వేడి మొదలైంది. ఆ వెంటనే ముంబై ముద్దుగుమ్మ పూజా హెగ్డే సైతం స్ట్రెచ్ ఛాలెంజ్ ని స్వీకరించి ఇంకా వేడి పెంచింది. ఓవైపు వరుసగా సినిమాల్లో నటించేస్తూ క్షణం తీరిక లేకుండా ఉన్న పూజాకి ఇవన్నీ ఎక్కడ కుదురుతున్నాయో. మరోవైపు రకుల్ ప్రీత్ సింగ్ సైతం వరుస ప్రాజెక్టులతో బిజీ అవుతోంది. ఇంకా ఈ ఛాలెంజ్ ని స్వీకరించేందుకు ఇతరత్రా ముద్దుగుమ్మలంతా క్యూ కట్టడం ఖాయం అన్నమాట!