అయ్యో పాపం రకుల్

Sun Feb 18 2018 14:57:03 GMT+0530 (IST)

‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో హిట్టు కొట్టాక చాలా వేగంగా స్టార్ హీరోయిన్ అయిపోయింది రకుల్. రవితేజ.. రామ్ చరణ్.. ఎన్టీఆర్.. అల్లు అర్జున్.. మహేష్ బాబు.. ఇలా శరవేగంగా స్టార్ హీరోల్ని కవర్ చేసేసింది. వేరే భాషల్లో కూడా అవకాశాలు అందుకుంటూ జోరుమీదున్న రకుల్ కు ఈ మధ్య చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తెలుగులో రకుల్ గత ఏడాది నటించిన సినిమాల్లో చాలా వరకు దారుణమైన ఫలితాలందించాయి. ‘విన్నర్’.. ‘జయ జానకి నాయక’ ఫ్లాప్ కాగా.. ‘స్పైడర్’ పెద్ద డిజాస్టర్ అయింది. ఇప్పుడు బాలీవుడ్లోనూ ఆమెకు నిరాశ తప్పలేదు. నీరజ్ పాండే లాంటి అదిరిపోయే ట్రాక్ రికార్డున్న దర్శకుడు కూడా రకుల్ కు హిట్టివ్వలేకపోయాడు.నీరజ్ పాండే దర్శకత్వంలో రకుల్ నటించిన ‘అయ్యారీ’ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఒకటికి రెండుసార్లు వాయిదా పడి ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రానికి ఆశించిన స్పందన రావట్లేదు. ఓ మోస్తరు సినిమాలకు కూడా మంచి రేటింగ్ ఇచ్చే తరణ్ ఆదర్శ్ ఈ చిత్రానికి రెండు స్టార్లు ఇచ్చి ‘డిజప్పాయింటింగ్’ అని కామెంట్ పెట్టాడు. ఎ వెడ్నస్ డే.. బేబీ.. స్పెషల్ చబ్బీస్.. ఎం.ఎస్.ధోని.. ఇలా నీరజ్ ఇంతకుముందు తీసిన సినిమాలన్నీ క్లాసిక్స్ అనిపించుకున్నాయి. కానీ ‘అయ్యారీ’ మాత్రం అతడి స్థాయికి ఏమాత్రం తగ్గ సినిమా కాదని అంటున్నారు. ఈ చిత్రం బోరింగ్ అంటున్నారు. సినిమా ఫెయిల్యూరే బాధాకరమైన విషయం అంటే.. ఈ చిత్రం రకుల్ కు పెద్దగా రోల్ లేదని.. ఆమె పెర్ఫామెన్స్ అంతంతమాత్రమే అని వస్తున్న కామెంట్లు ఆమెకు మరింత బాధ కలిగించేవే. ఇంతకుముందు ‘యారియాన్’ అనే బాలీవుడ్ మూవీలో నటిస్తే అది తుస్సుమనిపించింది. ఇప్పుడు పేరున్న దర్శకుడితో చేసినా రకుల్ కు నిరాశ తప్పలేదు.