Begin typing your search above and press return to search.

ర‌కుల్ లో ఈ టాలెంట్ కూడా ఉందా?

By:  Tupaki Desk   |   21 Jun 2018 4:46 PM GMT
ర‌కుల్ లో ఈ టాలెంట్ కూడా ఉందా?
X
మిస్ ఇండియా కావాల‌ని మోడ‌లింగ్ లో అడుగుపెట్టిన ప్రతి అమ్మాయి క‌ల‌లు క‌న‌డం స‌హ‌జం. అయితే, అందుకు కేవ‌లం అందం మాత్ర‌మే ఉంటే స‌రిపోదు. ఆ పోటీల్లో ఒత్తిడికి త‌ట్టుకొని నిల‌బ‌డ‌గ‌లిగే ఆత్మ‌విశ్వాసం - అభిన‌యంతో పాటు....అక్క‌డ ఎలా ఉండాలో - న‌డుచుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మిస్ ఇండియా పోటీల‌కు స‌న్న‌ద్ధ‌మ‌య్యేందుకు త‌గిన‌ శిక్ష‌ణ తీసుకోవ‌డం వ‌ల్ల ఆ పోటీల‌లో విజ‌యం సాధించ‌డం సుల‌భం. అయితే, ఆ శిక్ష‌ణ ఇచ్చే వారిపై కూడా విజ‌యావ‌కాశాలు ఆధార‌ప‌డి ఉంటాయి. తాజాగా, జ‌రిగిన ఫెమినా మిస్ ఇండియా-2018 విజేత అనుక్రీతి విజ‌యం వెనుకు కూడా ఓ ప్ర‌ముఖ శిక్ష‌కురాలుంద‌ట‌. చెన్నైకి చెందిన టీనేజ్ గ‌ర్ల్ అనుక్రీతి విజ‌యం వెనుక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌ పాత్ర ఉంద‌న్న విష‌యం చాలా ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

వాస్త‌వానికి టాలీవుడ్ కు రాకముందు ర‌కుల్ కూడా చాలా అందాల పోటీల్లో పాల్గొని విజేత‌గా నిలిచింది. గ‌తంలో మిస్ ఇండియా ఫైనల్స్ వరకు వెళ్లి టాప్-5 లో నిలిచింది. పీపుల్స్ ఛాయిస్ మిస్ ఇండియా టైమ్స్, పాంటలూన్స్ ఫెమినా మిస్ ఫ్రెష్ ఫేస్ - ఫెమినా మిస్ టాలెంటెడ్ - ఫెమినా మిస్ బ్యూటిఫుల్ స్మైల్, ఫెమినా మిస్ బ్యూటిఫుల్ ఐస్ వంటి పోటీల్లో విజేతగా నిలిచింది. ఈ నేప‌థ్యంలోనే అనుక్రీతికి రకుల్ మెంటార్‌ గా పని చేసింది. అయితే, ఆ విషయం ఇప్ప‌టివ‌ర‌కు బ‌య‌ట‌కు రాలేదు. మిస్ ఇండియా పోటీల‌కు అనుక్రీతి వెళ్లే ముందు రకుల్‌ శిక్షణనిచ్చింది. అందం - ఆత్మవిశ్వాసం - అభినయం - ఆహారం - నడక - నడత వంటి విషయాలలో ర‌కుల్ అమూల్య‌మైన స‌ల‌హాల‌ను అనుక్రీతి పాటించింది. స్వ‌యంగా రకుల్ ద‌గ్గ‌రే వాటిని సాధన చేసింది. రకుల్ కూడా త‌న బిజీ షెడ్యూల్ ను ప‌క్క‌నబెట్టి ఓపిగ్గా అన్ని విష‌యాల‌ను నేర్పించింది.