Begin typing your search above and press return to search.

రజినీని మాట్లాడించిన కలామ్

By:  Tupaki Desk   |   30 July 2015 12:03 PM GMT
రజినీని మాట్లాడించిన కలామ్
X
రజినీకాంత్ చాలా అరుదుగా నోరు విప్పుతుంటారు. తన సినిమాలకు సంబంధించి ఆడియో ఫంక్షన్లలో తప్పితే ఎప్పుడూ మాట్లాడరు. వేడుకలకు, ఫంక్షన్లకు బయటకు రావడం తక్కువ. ట్విట్టర్ అకౌంటైతే తెరిచారు కానీ.. అందులో ఎప్పుడో కానీ మెసేజ్ పెట్టరు. ఏడాది కిందట ట్విట్టర్ అకౌంట్ తెరిచిన రజినీ.. అప్పట్నుంచి మూణ్నాలుగు సందర్భాల్లో మాత్రమే ట్వీట్ చేశారు. ఎన్నికల్లో విజయం సాధించిన మోడీ, జయలలితలకు శుభాకాంక్షలు చెప్పిన రజినీ.. ఆ తర్వాత కోచ్చడయాన్ విడుదలైనపుడు ఓ ట్వీట్.. సింగపూర్ పితామహుడు లీ కౌన్ చనిపోయినపుడు మాత్రమే స్పందించారు. మళ్లీ ఆయన ఇన్నాళ్లకు కలాం మృతి మీద ట్వీట్ చేశారు. ఈ ఏడాది కాలంలో చివరగా డిసెంబరు 12న తన పుట్టిన రోజు నాడు శుభాకాంక్షలు అందరికీ ధన్యవాదాలంటూ ఓ ట్వీట్ చేశారు.

కలాం మృతి నేపథ్యంలో చాలా ఉద్వేగంగా స్పందించాడు రజినీ. ‘‘మహాత్మా గాంధీ.. కామరాజ్ ను, భారతీయార్ లాంటి మహానుభావుల్ని చూసే భాగ్యం నాకు దక్కలేదు. కానీ మహాత్మా కలాంజీ ఉన్న కాలంలోనే నేనూ బతికే భాగ్యం దక్కించుకున్నాను. సాధారణ జీవితం నుంచి మొదలుపెట్టి.. అత్యున్నత శిఖరాల్ని అధిరోహించారు కలాంజీ. కానీ ఆ స్థాయికి చేరాక కూడా సాధారణ జీవితాన్నే గడిపారు. కోట్ల మందిలో స్ఫూర్తి కలిగించారు. విద్యార్థుల్లో నిరంతరం ప్రేరణ కలిగిస్తూ సాగారు. దేవుడు ప్రేమతో ఆయన్ని దనదగ్గరికి తీసుకున్నాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’’ అంటూ ట్విట్టర్లో పేర్కొన్నాడు రజినీకాంత్.