Begin typing your search above and press return to search.

‘అమ్మ’ ఆ డైలాగ్ వింటే రజినీని వదుల్తుందా?

By:  Tupaki Desk   |   23 July 2016 5:30 PM GMT
‘అమ్మ’ ఆ డైలాగ్ వింటే రజినీని వదుల్తుందా?
X
అమ్మ పగబడితే ఎలా ఉంటుందో తమిళ ఇండస్ట్రీ జనాలకు తెలియంది కాదు. ఆ మధ్య కమల్ హాసన్ ఏవో పొలిటికల్ కామెంట్లు చేశాడని ‘విశ్వరూపం’ టైంలో జయలలిత కావాలని ఇబ్బంది పెట్టినట్లు వార్తలొచ్చాయి. మరోవైపు విజయ్ రాజకీయాల మీద ఆసక్తి చూపిస్తూ ‘తలైవా’ అనే సినిమా తీసినందుకు అతడికీ జయలలిత చుక్కలు చూపించడం తెలిసిన సంగతే. ఐతే సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రం అమ్మతో ఎప్పుడూ జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. ఈ మధ్య అమ్మ జైలు నుంచి బయటికి వస్తే ఆమెను కలిసి శుభాకాంక్షలు చెప్పడం.. ఎన్నికల్లో విజయం సాధించినపుడు కూడా వ్యక్తిగతంగా కలిసి అభినందనలు చెప్పడం ఇందుకు ఉదాహరణ.

ఇక ఎప్పట్నుంచో రజినీ రాజకీయ రంగ ప్రవేశం గురించి చాలా చర్చ నడుస్తోంది కానీ.. రజినీ దాని గురించి ఎటూ తేల్చకుండా నాన్చుతూ వస్తున్నాడు. ‘కబాలి’ సినిమా చూస్తున్నపుడు అంతర్లీనంగా రజినీ రాజకీయ ఉద్దేశాల గురించి డిస్కస్ చేసిన విషయం అర్థమవుతుంది. బడుగు బలహీన వర్గాల నాయకుడిగా రజినీని ప్రొజెక్ట్ చేయడం కోసం రంజిత్ చేసిన ప్రయత్నమే ‘కబాలి’ సినిమా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాలో అక్కడక్కడా కొన్ని పొలిటికల్ డైలాగులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో రజినీ చెప్పే ఓ డైలాగ్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘రాజ్యమేదైనా రాజు నేనే’ అంటాడు రజినీ క్లైమాక్స్ లో. దానికి ముందు విలన్ రజినీ స్థాయిని కించపరుస్తూ మాట్లాడతాడు. ఇదంతా తమిళనాట రాబోయే రాజకీయ వాతావరణానికి సంకేతం అని చర్చించుకుంటున్నారు అక్కడి జనాలు. మరి పైన చెప్పుకున్న డైలాగ్ గురించి అమ్మ దృష్టికి వెళ్తే ఆమె ఎలా స్పందిస్తుంది.. రజినీని ఆమె ఎలా డీల్ చేస్తుంది అన్నది ఆసక్తికరం.