సూపర్ స్టార్ ఇలా చేశాడేంటి...?

Tue Dec 12 2017 15:46:49 GMT+0530 (IST)

సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టిన రోజంటే హంగామా ఎలా ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆయన సినిమాల రిలీజ్ లేని సమయం అయినా సరే.. మీడియాలో.. సామాజిక మాధ్యమాల్లో హడావుడి ఉంటుంది. ఇక రజినీ పుట్టిన రోజు సమయానికి ఆయన సినిమాలు ఏవైనా చిత్రీకరణలో ఉంటే.. వాటికి సంబంధించిన ప్రత్యేక విశేషాలతో చిత్ర బృందాలు అభిమానుల్ని పలకరిస్తాయి. అలరిస్తాయి. ఐతే ఈసారి అలాంటి హడావుడి పెద్దగా కనిపించట్లేదు. ఇప్పుడు రజినీ నటించిన ‘2.0’ లాంటి మెగా మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. కానీ ఈ చిత్ర బృందం.. రజినీ పుట్టిన రోజుకు ఒక్క పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు. అభిమానుల సంగతి పట్టించుకోనే లేదు. మరోవైపు ‘కాలా’ టీం మాత్రం కొత్త పోస్టర్ ఒకటి వదిలింది. అదేమంత ప్రత్యేకంగా అనిపించట్లేదు. ఏదో మొక్కుబడిగా ఈ తంతు ముగించినట్లున్నారు.మరోవైపు ఈసారి పుట్టిన రోజుకు రజినీ రాజకీయారంగేట్రానికి సంబంధించిన ప్రకటన వస్తుందన్న అంచనాలు కూడా ఫలించలేదు. రజినీ నుంచి ఏదో ఆశించి ఆయన ఇంటికి వచ్చిన అభిమానులకు నిరాశే ఎదురైంది. రజినీ అసలు ఇంట్లోనే లేరు. ఆయన బెంగళూరుకు వెళ్లారని.. అక్కడ సీక్రెట్ ప్లేస్ ప్రశాంతంగా ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఐతే తమిళనాట ఇటీవల తుఫాను.. వరదల వల్ల వందల మంది జాలర్లు గల్లంతవడం.. 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో తన పుట్టిన రోజు వేడుకలు చేయొద్దని.. ఏ సందడీ వద్దని అందరికీ చెప్పేసి రజినీ చెన్నై విడిచి వెళ్లినట్లుగా చెబుతున్నారు. ఏదేమైనా రజినీ అభిమానులు మాత్రం ఆయన పుట్టిన రోజు నాడు బాగా డిజప్పాయింట్ అయిన మాట వాస్తవం.