Begin typing your search above and press return to search.

రజినీ సార్.. మీ పోస్టర్లకో దండం

By:  Tupaki Desk   |   17 Aug 2017 10:51 AM GMT
రజినీ సార్.. మీ పోస్టర్లకో దండం
X
పోయినేడాది సూపర్ స్టార్ కొత్త సినిమా ‘కబాలి’ విషయంలో జరిగిన హంగామా అంతా ఇంతా కాదు. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి అద్భుతమైన పోస్టర్లతో అదరగొట్టాడు దర్శకుడు పా.రంజిత్. సూపర్ స్టార్‌ను మునుపెన్నడూ లేని విధంగా ప్రెజెంట్ చేస్తూ అద్భుతమైన పోస్టర్లు డిజైన్ చేయించాడతను. సినిమా మొదలైనపుడు రిలీజ్ చేసిన ఫస్ట్ పోస్టరే కేక పుట్టించేసింది. ఇక ఆ తర్వాత ఇలాగే మతి పోగొట్టిన పోస్టర్లు ఎన్నెన్నో. రిలీజ్ ముంగిట కూడా పోస్టర్లతో పిచ్చెక్కించడం మానలేదు రంజిత్. ఆ పోస్టర్లు.. ఒక్క టీజరే సినిమాపై అంచనాల్ని అమాంతం పెంచేశాయి. సినిమా కోసం వెర్రెత్తిపోయేలా చేశాయి. కానీ చివరికి సినిమా చూస్తే మొత్తం తలకిందులైంది.

ప్రోమోలకు.. సినిమాకు సంబంధమే లేదసలు. పోస్టర్లలో కనిపించిన ఇంటెన్సిటీ సినిమాలో లేకపోవడంతో ప్రేక్షకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆ సంగతలా వదిలేస్తే ఇప్పుడు రజినీ-రంజిత్ కాంబినషన్లో ‘కాలా’ అనే కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదలైనపుడు కూడా అదిరిపోయే పోస్టర్ లాంచ్ చేశారు. జీపు మీద స్టైలుగా కూర్చున్న రజినీ వారెవా అనిపించాడు. ఇప్పుడు కొత్తగా రిలీజ్ చేసిన ‘కాలా’ పోస్టర్లోనూ రజినీ అదరగొట్టేస్తున్నాడు. ఐతే ఈ పోస్టర్లను చూసి సినిమాపై ఆశలు పెంచుకునే పరిస్థితి ఇప్పుడు లేదు. ఇలాంటి పోస్టర్లతో అంచనాలు పెంచుకోవడం వల్లే ‘కబాలి’తో గట్టి ఎదురు దెబ్బ తిన్నారు. కాబట్టి ఇంకోసారి అలా మాయలో పడే పరిస్థితి లేదు. అందుకే మీ పోస్టర్లకో దండం సామీ అంటూ నిట్టూరుస్తున్నారు.