Begin typing your search above and press return to search.

ఆ మ్యాజిక్ శంకర్ మాత్రమే చేయగలడు

By:  Tupaki Desk   |   23 July 2016 11:30 AM GMT
ఆ మ్యాజిక్ శంకర్ మాత్రమే చేయగలడు
X
రజినీకాంత్ లాంటి హీరో సౌత్ ఇండియాలోనే కాదు.. ఇండియాలోనే ఎక్కడా లేడు. ఇంకా చెప్పాలంటే అసలు ప్రపంచంలోనే ఎక్కడా కూడా ఇలాంటి మ్యాడ్ ఫ్యానిజం ఉన్న హీరో ఇంకొకరు లేదన్నా కూడా అతిశయోక్తి లేదు. 66 ఏళ్ల ఒక హీరోను చూస్తూ ఈ తరం యూత్ కూడా ఊగిపోతున్నారంటే.. ఆయన మేనియాలో మునిగితేలడాన్ని ఒక మత్తులాగా భావిస్తున్నారంటే రజినీ ఎంత పెద్ద స్టార్‌ గా అవతరించాడో అర్థం చేసుకోవచ్చు.

అలాంటి స్టార్ తో సినిమా చేసే అవకాశం అందరికీ లభించదు. రజినీతో సినిమా అనగానే ఆ దర్శకుడి పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతుంది. అతడి స్థాయిలో కొన్ని వందల రెట్లు పెరిగిపోతుంది. ఇక తెరమీద రజినీ మ్యాజిక్ ఎలా ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచంలో ఏ హీరోకూ లేని సమ్మోహన శక్తి ఆయన సొంతం. ఓ మోస్తరు సన్నివేశాల్ని కూడా ఆ సమ్మోహన శక్తితో ఆకర్షణీయంగా మార్చడం ఆయనకే చెల్లుతుంది. ఐతే ఇలాంటి హీరోను తెరమీద సరిగా ప్రెజెంట్ చేయడంలో దర్శకులు విఫలమవుతున్నారు. రజినీ ఇస్తున్న అవకాశాలను ఆయా దర్శకులు చేజేతులా వృథా చేస్తున్నారు.

రజినీ చాలా ఏళ్లుగా సీనియర్ దర్శకులతోనే పని చేస్తూ వస్తున్నాడు. ఐతే గతంలో రజినీతో బ్లాక్ బస్టర్లు ఇచ్చిన దర్శకులందరూ ఆ తర్వాత ఆయన ఇచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. సురేష్ కృష్ణ.. పి.వాసు.. కె.ఎస్.రవికుమార్.. లాంటి వాళ్లు రజినీకి చేదు అనుభవాన్ని మిగిల్చారు. ఐతే ఇప్పటి ప్రేక్షకుల అభిరుచిని ఈ సీనియర్లు అందుకోలేకపోతున్నారేమో అని.. రెండు విభిన్నమైన సినిమాలు తీసిన యువ దర్శకుడు పా.రంజిత్ కు ఛాన్సిస్తే అతను కూడా రజినీని అభిమానులు ఆశించినట్లు చూపించలేకపోయాడు.

టీజర్ కట్ చేయడంలో చూపించిన ప్రతిభను.. సినిమాలో చూపించలేకపోయాడు రంజిత్. రజినీ సినిమా ఎలా ఉండాలని ఆశిస్తామో దానికి భిన్నంగా ఉంది ‘కబాలి’. సూపర్ స్టార్.. ఆరంభంలో చివర్లో మాత్రమే కాస్త తనదైన శైలిలో ఎంటర్టైన్ చేశాడు. మిగతా సినిమా అంతటా రజినీ కూడా నిస్సహాయంగా ఉండిపోయాడు. రజినీని అలా నిస్సహాయుడిలా.. నీరసంగా చూపించడంలో రంజిత్ ఉద్దేశమేంటో అర్థం కాదు. రజినీని ఓ సామాన్యుడిలా చూపించొచ్చు కానీ.. అలా నీరసంగా.. నిస్సహాయంగా చూపిస్తే మాత్రం అభిమానులకు రుచించలేదు.

మొత్తానికి బంగారం లాంటి ఓ అవకాశాన్ని వృథా చేసుకున్నాడు రంజిత్. గత కొన్నేళ్లలో రజినీ సినిమాల్ని పరిశీలిస్తే ఒక్క శంకర్ మాత్రమే ఆయన్ని తెరమీద సరిగా ప్రెజెంట్ చేయగలడన్న సంగతి స్పష్టమైంది. శివాజీ.. రోబో సినిమాలు రెండింట్లోనూ రజినీ ఎనర్జీని పూర్తిగా వాడుకున్నాడు శంకర్. ఇప్పుడిక ‘2.0’ మీదే ఆశలు నిలిచి ఉన్నాయి. శంకర్ మరోసారి అభిమానుల ఆంకాక్షల్ని అందుకుంటాడేమో చూద్దాం.