బాద్షాకు తలైవా హ్యాండ్ అవసరమైందే

Sun Aug 13 2017 11:56:15 GMT+0530 (IST)

బాలీవుడ్ కింగ్ ఖాన్ గా.. బాద్షాగా సుపరిచితుడు షారుక్ ఖాన్. గడిచిన కొంతకాలంగా అతని పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. అతను చేసిన సినిమాలన్నీ వరుస పెట్టి మరీ బాక్సాఫీస్ దగ్గర పల్టీలు కొడుతున్నాయి. దీంతో.. ఆ మధ్య వరకు కలెక్షన్ కింగ్ గా పేరున్న షారుక్ పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారింది. గడిచిన కొన్నేళ్లుగా ఆయన చేసిన సినిమాలన్నీ పల్టీల మీద పల్టీలు కొడుతున్నాయి.తాజాగా ఎన్నో ఆశలు పెట్టుకున్న జబ్ హ్యారీ మెట్ సెజాల్ సైతం దెబ్బ తినటంతో షారుక్ ఫ్యూచర్ ఏమిటన్నది అర్థం కానిదిగా మారింది. తన రేంజ్ కు తగ్గట్లు హిట్టు ఇచ్చే దర్శకుడు ఎవరన్నది ఇప్పుడు షారుక్ కు పెద్ద ప్రశ్నగా మారింది. తన దిశ..దశను మార్చే దర్శకుడి కోసం వెతికిన షారుక్ చివరకు దర్శకుడు కబీర్ ఖాన్ ను సెలెక్ట్ చేసుకున్నట్లుగా చెబుతున్నారు.

సల్మాన్‌కు భజరంగి భాయిజాన్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన కబీర్.. ఈ మధ్యన అదే సల్మాన్ కు ట్యూబ్ లైట్ లాంటి దారుణమైన డిజాస్టర్ ను ఇచ్చినప్పటికీ షారుక్ మాత్రం.. కబీర్‌ను నమ్ముకోవటం విశేషం.  షారుక్ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సిద్వాత్ అని పేరును కన్ఫర్మ్ చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ సినిమాలో దీపికాను ఓకే చేశారు. షారుక్ తో ఆమె జత కట్టిన చెన్నై ఎక్స్ ప్రెస్ కలెక్షన్ల పరంగా ఎంత దుమ్ము రేపిందో తెలిసిందే. రజనీ లుంగీ డ్యాన్స్ తో  యావత్ దేశమంతా మారుమోగిపోయింది.

టైం ఏమాత్రం బాగోలేని వేళ.. సెంటిమెంట్ ను నమ్ముకోవాలన్న ఆలోచనలో షారుక్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే.. రజనీ చేత కోసం ఓ అతిధి పాత్ర చేయించాలన్న ఆలోచనలో బాద్షా ఉన్నట్లు చెబుతున్నారు. అంతేకాదు.. ఈ చిత్రంలో కండల వీరుడు సల్మాన్ కోసం కూడా ఒక అతిధి పాత్రను ప్రవేశ పెట్టాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ అతిధి పాత్రల పరంపరలో ప్రభాస్ పేరు కూడా వినిపిస్తున్నప్పటికీ.. అది కన్ఫర్మ్ కాదని చెబుతున్నారు. రజనీ.. సల్మాన్లు మాత్రం పక్కా అంటున్నారు. మొత్తానికి బాద్షాకు తలైవా హ్యాండ్ అవసరమైందని చెప్పతప్పదు.