Begin typing your search above and press return to search.

మామా అల్లుళ్లు ఇరుక్కున్నారు

By:  Tupaki Desk   |   14 Jun 2018 5:54 AM GMT
మామా అల్లుళ్లు ఇరుక్కున్నారు
X
సూపర్ స్టార్ రజనీ కాంత్ తో సినిమా అంటే జూదం అన్నట్లే. ఆయన సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే మామూలుగా ఆడవు. కలెక్షన్ల రికార్డులన్నీ బద్దలైపోతాయి. కానీ తేడా వస్తే నష్టాల విషయంలోనూ రికార్డుల మోత మోగిపోతుంది. ఈ సినిమాపై పెట్టుబడి పెట్టిన వాళ్లందరూ మునిగిపోతారు. అమ్మకాలు భారీ స్థాయిలో జరుగుతాయి కాబట్టి.. తేడా వస్తే బయ్యర్ల కుటుంబాలే రోడ్డు మీదికి వచ్చేస్తాయి. అందుకే రజనీ సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చిన ప్రతిసారీ బయ్యర్లకు.. ఆయనకు మధ్య రగడ మొదలవుతుంది. గతంలో తన సినిమాలకు నష్టం వచ్చినపుడు బయ్యర్లను ఆదుకోవడం వల్ల రజనీ తర్వాతి కాలంలో సైలెంటుగా ఉన్నపుడల్లా చెడ్డ పేరు తెచ్చుకుంటున్నాడు. ‘లింగ’ దగ్గర ఈ విషయంలో పెద్ద గొడవే నడిచింది. ఐతే ఈ ఆనవాయితీ అంత మంచిది కాదన్న ఉద్దేశంతో ‘కబాలి’ విషయంలో రజనీ ఏమాత్రం జోక్యం చేసుకోలేదు. ఆ చిత్రానికి మరీ ఎక్కువ నష్టాలు కూడా రాలేదు.

కానీ రజనీ కొత్త సినిమా ‘కాలా’ సంగతి వేరు. దీనికి ముందు నుంచి బజ్ లేదు. దీంతో ఓపెనింగ్స్ పేలవంగా వచ్చాయి. తమిళనాట ఓపెనింగ్స్ పర్వాలేదు కానీ.. అక్కడ కూడా తర్వాత సినిమా నిలబడటం లేదు. ‘కబాలి’ స్థాయిలో కాకపోయినా ‘కాలా’ మీద కూడా బయ్యర్లు భారీగానే పెట్టుబడి పెట్టారు. పరిస్థితి చూస్తుంటే వాళ్ల పెట్టుబడిలో 50-60 శాతానికి మించి వెనక్కి వచ్చేలా లేదు. ఈ నేపథ్యంలో బయ్యర్లు రజనీ మీద అటాక్‌కు సిద్ధమవుతున్నారు. ఈసారి రజనీ తనకేం సంబంధం లేదంటూ చేతులెత్తేసే పరిస్థితి కూడా లేదు. ఈ చిత్రాన్ని నిర్మించింది ఆయన అల్లుడు ధనుష్. మామ క్రేజుని క్యాష్ చేసుకుని భారీగా లాభాలందుకుందామన్న ప్రణాళికతో అతను ఈ సినిమా ప్లాన్ చేసుకున్నాడు. అతడి ప్లాన్ తమిళనాడు వరకు బాగానే వర్కవుటైంది.

కానీ తెలుగులో పెద్ద దెబ్బ పడింది. ఇక్కడ బయ్యర్లెవరూ ముందుకు రాకపోవడంతో సొంతంగా రిలీజ్ చేసుకోవాల్సి వచ్చింది. మరోవైపు కర్ణాటకలో సినిమా విడుదలకు ఆటంకాలు ఎదురై.. అక్కడి బయ్యర్ ముందు అనుకున్న ఒప్పందం ప్రకారం డబ్బులివ్వలేదు. ఇలా తమిళనాడు అవతల ‘కాలా’ ద్వారా ధనుష్ పెద్దగా సొమ్ము చేసుకున్నది లేదు. తమిళనాడులో ఏమో.. బయ్యర్లు తమ నష్టాన్ని భర్తీ చేయాలంటూ ఇప్పటికే ఒత్తిడి తెస్తున్నారు. దీంతో మామా అల్లుళ్లు అడ్డంగా ఇరుక్కుపోయినట్లయింది. ఈ స్థితిలో వాళ్లిద్దరూ ఏం చేస్తారో చూడాలి.