Begin typing your search above and press return to search.

రాజశేఖర్ రెండో కూతురు కూడా..

By:  Tupaki Desk   |   17 Aug 2018 11:02 AM GMT
రాజశేఖర్ రెండో కూతురు కూడా..
X
ఇంతకుముందు సినీ కుటుంబాల నుంచి అబ్బాయిలు మాత్రమే సినిమాల్లోకి వచ్చేవాళ్లు. కానీ గత కొన్నేళ్ల నుంచి అమ్మాయిలు కూడా ఇటు వైపే అడుగులేస్తున్నారు. మంచు లక్ష్మి.. కొణిదెల నిహారిక లాంటి వాళ్లు ఈ విషయంలో మిగతా వాళ్లుక స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈ బాటలోనే రాజశేఖర్ పెద్ద కూతురు శివాని ఇప్పటికే కథానాయికగా మారిన సంగతి తెలిసిందే. ఆమె తెలుగులో అడివి శేష్ సరసన ‘2 స్టేట్స్’ సినిమాలో నటిస్తోంది. తమిళంలోనూ ఒక సినిమా చేస్తోంది. త్వరలోనే అక్క బాటలో రాజశేఖర్ రెండో కూతురు శివాత్మిక కూడా తెరంగేట్రం చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. సురేష్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద బేనర్లో ఆమె కథానాయికగా పరిచయం అవుతుందని అంటున్నారు.

‘క్షణం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రవికాంత్ పేరెపు ఈ బేనర్లో ఒక సినిమా చేయబోతున్నాడు. దానికి ‘దొరసాని’ అనే టైటిల్ కూడా అనుకుంటున్నారట. ఇందులో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తాడని ఇంతకుముందే వార్తలొచ్చాయి. ఈ చిత్రంతోనే శివాత్మిక కూడా పరిచయం అవుతుందని అంటున్నారు. శివాత్మికకు సినిమాలపై ఆసక్తి ఉందని ఇంతకుముందే వెల్లడైంది. తన తండ్రి సినిమాలకు సంబంధించిన వేడుకల్లో ఆమె చాలా చురుగ్గా పాల్గొనేది. ఒక వేడుకలో శివాత్మిక డ్యాన్స్ కూడా చేసింది. ఆమెను ముందు విద్యారంగంలో ఎదగనివ్వాలని రాజశేఖర్ అనుకున్నాడట. తాము పెట్టిన స్కూల్ బాధ్యతలు శివాత్మికకే అప్పగించాడట. కానీ ఆమె మనసు సినిమాల వైపే లాగడంతో ఈ దిశగా ప్రిపేర్ చేయిస్తున్నారట. త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సమాచారం.