Begin typing your search above and press return to search.

'అర్జున' సినిమా వస్తోంది

By:  Tupaki Desk   |   26 Sep 2016 8:39 AM GMT
అర్జున సినిమా వస్తోంది
X
రాజశేఖర్.. ఒకప్పుడు స్టార్ హీరో. ‘అంకుశం’ లాంటి సినిమాలతో.. యాంగ్రీ యంగ్ మ్యాన్ పాత్రలతో స్టార్ ఇమేజ్ సంపాదించి. తనకంటూ ప్రత్యేక అభిమాన వర్గాన్ని సంపాదించుకున్నారాయన. కానీ కాలానికి తగ్గట్లు మారకపోవడంతో సినిమాలు పోయాయి. ఇమేజ్ దెబ్బ తింది. అభిమాన వర్గమూ దూరమైంది. కొన్నేళ్లుగా ఆయన సినిమాల్ని జనాలు పట్టించుకోవడమే మానేశారు.

రాజశేఖర్ చివరి సినిమా ‘గడ్డం గ్యాంగ్’ అయితే వచ్చింది తెలియదు.. వెళ్లింది తెలియదు. ఆ తర్వాత తేజ దర్శకత్వంలో విలన్ పాత్రలో ‘అహం’ అనే సినిమా చేస్తాడని వార్తలొచ్చాయి కానీ.. ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రాజశేఖర్ ఓ సినిమా చేస్తున్నాడట. ఈ సినిమా ఎప్పుడొస్తుందో ఏమో కానీ.. దాని కంటే ముందు ‘అర్జున’ అని రాజశేఖర్ హీరోగా నటించిన ఓ చిత్రం త్వరలోనే విడుదల కాబోతోంది.

అర్జున.. ఎప్పుడో నాలుగేళ్ల కిందట మొదలైన సినిమా. పూర్తయి కూడా చాలా కాలమైంది. నా ఊపిరి.. చిన్నోడు లాంటి సినిమాలు తీసిన కణ్మణి దర్శకత్వం వహించాడు. ఎ.ఎ.ఆర్ట్స్ పతాకంపై చంద్రశేఖర్ (జీతు) నిర్మించాడు. అసలు విడుదలే కాదనుకున్న ఈ సినిమాను ఉన్నట్లుండి ఇప్పుడు రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. పేపర్లో యాడ్ కూడా ఇచ్చారు. వర్తమాన రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కినట్లు చెబుతున్నారు. ఇందులో రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేశాడు. మరి ఈ సినిమాను జనాలు ఏమాత్రం పట్టించుకుంటారో చూడాలి.