Begin typing your search above and press return to search.

రాజశేఖర్‌ కు ఇన్విటేషన్లే మిగిలాయ్

By:  Tupaki Desk   |   11 Dec 2017 10:30 PM GMT
రాజశేఖర్‌ కు ఇన్విటేషన్లే మిగిలాయ్
X
‘గరుడవేగ’ సినిమాతో మళ్లీ టాలీవుడ్ చర్చల్లో నిలిచాడు సీనియర్ హీరో రాజశేఖర్. అంతకుముందు ఆయన సినిమాలేమైనా వస్తే కనీస చర్చ ఉండేది కాదు. వాటి గురించి జనాలు పట్టించుకునేవాళ్లు కాదు. రాజశేఖర్ సినిమాలు వస్తున్న సంగతి.. వెళ్తున్న సంగతి కూడా తెలిసేది కాదు. ఐతే ‘గరుడవేగ’ మాత్రం అలా కాలేదు. ఈ సినిమాకు ప్రి రిలీజ్ బజ్ వచ్చింది. విడుదల తర్వాత కూడా దీని గురించి పెద్ద చర్చే నడిచింది. ఈ సినిమాకు అన్ని వైపులా పాజిటివ్ టాక్ వచ్చింది. కలెక్షన్లు కూడా ఓ మోస్తరుగా వచ్చాయి. దీనికి శాటిలైట్.. డిజిటల్.. డబ్బింగ్ హక్కులకు మంచి రేటే వచ్చినట్లు వార్తలొచ్చాయి.

ఐతే ఇప్పుడు ‘గరుడవేగ’ కథ ముగిసింది. మొత్తంగా ఈ సినిమా వల్ల ఎవరికి ప్రయోజనం.. ఎంత ప్రయోజనం అని చూస్తే.. అందరి కంటే ఎక్కువ గెయిన్ అయిందైతే దర్శకుడు ప్రవీణ్ సత్తారునే. ఇంతకుముందు కూడా మంచి సినిమాలు తీసినప్పటికీ సత్తారు సత్తా ఏంటో ఇప్పుడే అందరికీ తెలిసిందే. అతను స్టార్లను కూడా డీల్ చేయగలడని రుజువైంది. ఇప్పటికే గోపీచంద్ బయోపిక్ కమిటై ఉన్న సత్తారు.. తర్వాత ఆ సినిమానే తీయబోతున్నాడు. దీని తర్వాత సత్తారుతో సినిమా చేయడానికి కొంతమంది ప్రముఖ నిర్మాతలు.. హీరోలు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక హీరో రాజశేఖర్ సంగతి చూస్తే.. ఇప్పటిదాకా ఆయన తర్వాతి ప్రాజెక్టు ఏదీ కమిట్ కాలేదు. తేజ దర్శకత్వంలో వెంకీ చేయబోతున్న సినిమాలో కీలక పాత్ర చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి కానీ అధికారిక సమాచారం అయితే లేదు. ప్రస్తుతానికైతే రాజశేఖర్ కు వేరే సినిమాల వేడుకలకు ఇన్విటేషన్లు మాత్రం బాగానే వస్తున్నాయి. గత నెల రోజుల్లో ఆయన మూణ్నాలుగు సినిమాల వేడుకల్లో పాల్గొన్నాడు. ఇటీవలే ‘ఇంద్రసేన’.. ‘చందమామ రావే’ అనే సినిమాల వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఇంతకుముందు రాజశేఖర్ కు ఈ మాత్రం గౌరవం కూడా ఉండేది కాదు. తనను అస్సలు పట్టించుకోని జనాలు.. ఇప్పుడు తనను సినిమా ఫంక్షన్లకు అతిథిగా పిలుస్తున్నందుకు.. ఇంటర్వ్యూలు అడుగుతున్నందుకు రాజశేఖర్ చాలా హ్యాపీగానే ఉన్నట్లున్నారు కానీ.. ఇంతకీ ఆయనకు సినిమాల అవకాశాల సంగతేంటో చూడాలి.