జక్కన్నా.. ఏం ఫొటో పెట్టావన్నా

Sat Nov 18 2017 23:28:01 GMT+0530 (IST)

శనివార రాత్రి పది గంటల సమయం. ట్విట్టర్ జనాలు ఒకసారి అప్ డేట్లు చూసుకుని నిష్క్రమించడానికి సిద్ధమవుతున్నారు. అలాంటి సమయంలో మెరుపులాంటి ఒక ట్వీట్ వచ్చి పడింది. రాజమౌళి షేర్ చేసిన ఆ ఫొటో నిమిషాల్లో వైరల్ అయిపోయింది. లక్షలాది మందికి చేరిపోయింది. కొన్ని గంటల్లోనే ట్విట్టర్ - ఫేస్ బుక్ - వాట్సాప్.. ఇలా ఎక్కడ చూసినా ఆ ఫొటోనే. టాలీవుడ్ ధ్రువతారలు జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ లతో రాజమౌళి ఎంత ఆత్మీయంగా ఉన్న ఫొటో అది.ఈ ఫొటోకు కామెంట్ ఏమీ పెట్టలేదు రాజమౌళి. కేవలం కొన్ని డాట్స్ పెట్టి.. ఒక ఇమోజీ జోడించి.. ఈ డాట్స్ ను మీరే ఫిల్ చేసుకోండి అన్నట్లుగా ఊరుకున్నాడు జక్కన్న. ముందు ఇది క్యాజువల్ పిక్ అనే అనుకున్నారు. కానీ కాసేపటికే ఆసక్తికర చర్చ మొదలైపోయింది. ఈ ఇద్దరితో జక్కన్న మల్టీస్టారర్ తీయబోతున్నాడా అన్నదే ఆ చర్చ. మొదట ఊహాగానంలాగా అనిపించిన ఈ ముచ్చట.. కాసేపటికే నిజమే కావచ్చన్నట్లుగా చర్చ జరిగింది. ఇంతలోనే రాజమౌళి తన కవర్ ఫొటోగా కూడా దీన్నే పెట్టాడు. ఇక అంతే సందేహాలు పటాపంచలయ్యాయి. ఎన్టీఆర్ - చరణ్ లతో రాజమౌళి మల్టీస్టారర్ పక్కా అన్న అభిప్రాయానికి వచ్చేశారు జనాలు.

చాలామంది టాలీవుడ్ పీఆర్వోలు సైతం తారక్ - చెర్రీలతో రాజమౌళి మల్టీస్టారర్ పక్కా అనే అంటున్నారు. కొందరేమో ఫిబ్రవరిలో షూటింగ్ అని.. ఇంకొందరేమో ఆగస్టులో కానీ సినిమా పట్టాలెక్కదని చెబుతున్నారు. గతంలో తాను ఇచ్చిన కమిట్మెంట్ ను నిలబెట్టుకుంటూ డీవీవీ దానయ్యకే జక్కన్న ఈ సినిమా చేస్తాడని అంటున్నారు. ఈ సినిమాకు కథ అయితే ఇంకా పక్కాగా రెడీ కాలేదని.. ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్ బృందం ఆ పనిలోనే ఉందని చెబుతున్నారు. ఎన్టీఆర్.. చరణ్ లకు ఇప్పుడు వేరే కమిట్మెంట్లు ఉన్నాయి. చరణ్ బోయపాటితో.. ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమాలు చేయాల్సి ఉంది. వాటిని పూర్తి చేశాకే.. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో జక్కన్న సినిమాలోకి రావచ్చంటున్నారు.

ఈ మల్టీస్టారర్ గురించి అధికారిక ప్రకటన వచ్చేస్తే ఇక తెలుగు ప్రేక్షకుల ఆనందానికి అవధులుండవు. ఇది మామూలు ఎగ్జైట్మెంట్ ఇచ్చే కాంబినేషన్ కాదు. మూడు నాలుగు దశాబ్దాల్లో ఇంత క్రేజీ కాంబినేషన్ మరొకటి ఉండి ఉండదంటే అతిశయోక్తి కాదు. గత రెండు దశాబ్దాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తించిన మల్టీస్టారర్ కాంబినేషన్ అంటే మహేష్ బాబు-వెంకటేష్ లదే. ఐతే వెంకీ ఎంతైనా సీనియర్ అయిపోయాడు. ఆయన క్రేజ్ తగ్గింది. పైగా ఈ సినిమా తీసింది శ్రీకాంత్ అడ్డాల. కానీ ఇప్పుడు తెరమీదికి వచ్చిన సినిమాకు దర్శకుడు రాజమౌళి. పైగా ప్రస్తుతం టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్లలో ఇద్దరు ఇందులో నటించబోతున్నారు. కాబట్టి ఈ కాంబినేషన్ కు ఉన్న క్రేజే వేరు.

గత నాలుగైదు రోజులుగా తెలుగు సినీ పరిశ్రమ జనాలు.. ప్రేక్షకులు నంది అవార్డుల గొడవ గురించే చర్చించుకుంటున్నారు. ఈ గొడవతో నందమూరి.. మెగా ఫ్యామిలీలు.. అభిమానుల మధ్య పెద్ద అగాథమే నెలకొనే పరిస్థితి తలెత్తింది. ఈ పరిణామంపై ఇండస్ట్రీ పెద్దలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజు రోజుకూ వివాదం పెద్దదై అంతరం పెరిగిపోతుండటంతో మున్ముందు ఎలాంటి పరిణామాలు ఉంటాయో అన్న చర్చ కూడా నడుస్తోంది. ఇది ఇంసడ్ట్రీకి మంచిది కాదని అంటున్నారు. ఇలాంటి తరుణంలో మెగా-నందమూరి స్టార్ హీరోల మధ్య మల్టీస్టారర్ తెరమీదికి రావడంతో ఇక చర్చ మొత్తం దీని మీదికి మళ్లనుంది. ఈ కలయిక అభిమానుల్లో అంతరాన్ని తొలగించడానికి.. నంది అవార్డుల రగడకు తెరదించడానికి ఉపకరిస్తుందనడంలో సందేహం లేదు. మొత్తానికి జక్కన్న సరైన టైమింగ్ చూసి ఈ ఫొటోను షేర్ చేశాడనే చెప్పాలి.