Begin typing your search above and press return to search.

ఆర్ ఆర్ ఆర్.. నేరుగా యాక్షన్ ఘట్టంతో

By:  Tupaki Desk   |   11 Nov 2018 5:28 PM GMT
ఆర్ ఆర్ ఆర్.. నేరుగా యాక్షన్ ఘట్టంతో
X
తెలుగులో ఒక కలల కాంబినేషన్ శ్రీకారం చుట్టుకుంది. జూనియర్ ఎన్టీఆర్-రామ్ చరణ్ కాంబినేషన్లో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించబోయే మల్టీస్టారర్ మూవీ ఆదివారమే ప్రారంభోత్సవం జరుపుకుంది. ఐతే ఏదో లాంఛనంగా ఈ రోజు ప్రారంభోత్సవం జరిపి.. రెగ్యులర్ షూటింగ్ లేటుగా మొదలుపెట్టడం లాంటిదేమీ చేయట్లేదు జక్కన్న. ఇంకో వారం రోజుల్లోనే షూటింగ్ కూడా మొదలు కాబోతోంది. దీని గురించి నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ ట్విట్టర్ లో వివరాలు వెల్లడించింది. ‘ఆర్ ఆర్ ఆర్’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం నవంబరు 19న సెట్స్ మీదికి వెళ్లనుంది. ఆ రోజు ఎన్టీఆర్-చరణ్ ల మీద తీసే యాక్షన్ సీక్వెన్స్ తో షూటింగ్ మొదలుపెడతారట.

ఈ చిత్రంలో ఎన్టీఆర్-చరణ్ ప్రత్యర్థులుగా కనిపించబోతున్నారని.. ఎన్టీఆర్ ది నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అని.. సినిమా అంతా వీళ్లిద్దరూ కలహించుకుంటూ ఉంటారని.. తర్వాత ఒక్కటవుతారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మొదలు మొదలే ఇద్దరి మీదా కలిపి యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నారంటే ఈ ఊహాగానాలే నిజమేమో అనిపిస్తోంది. మరోవైపు ఈ చిత్రానికి పని చేసే టెక్నీషియన్ల వివరాల్ని నిర్మాణ సంస్థ వెల్లడించింది. చాలా వరకు జక్కన్న ఆస్థాన టెక్నీషియన్లే ఈ చిత్రానికీ పని చేస్తున్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాదే దీనికి కథ అందిస్తున్నాడు. ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూరుస్తున్నాడు.కె.కె.సెంథిల్ కుమారే ఈ చిత్రానికీ ఛాయాగ్రహణం అందిస్తున్నాడు. వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్‌ గా శ్రీనివాస్ మోహన్‌.. ప్రొడక్షన్ డిజైనర్‌ గా సాబు సిరిల్.. ఎడిటర్ గా శ్రీకర్ ప్రసాద్‌.. కాస్ట్యూమ్ డిజైనర్ గా రమ రాజమౌళి బాధ్యతలు తీసుకుంటున్నారు. తెలుగులో సాయిమాధవ్ బుర్రా.. తమిళంలో మదన్ కార్కీ మాటలు రాస్తున్నారు.