అంతకంటే ఎక్కువే కావాలి

Thu May 18 2017 15:35:02 GMT+0530 (IST)

బాహుబలి సినిమాతో రాజమౌళి పేరు మార్మోగిపోతోంది.  అతడి ప్రతిభకు అంతా సెల్యూట్ కొట్టారు. రూ. 1000 కోట్ల కలెక్షన్లే అందని ద్రాక్ష అనుకన్నఇండియన్ సినిమాను రూ. 1500 కోట్ల కలెక్షన్ల స్థాయికి తీసుకెళ్లాడు రాజమౌళి. ఈ విజయం తర్వాత భారీ బడ్జెట్ తో సినిమాలు తీసేందుకు నిర్మాతల్లోనూ ధైర్యం పెరిగింది. మరి ఇంతటి ఘన విజయం సాధించిన రాజమౌళి తర్వాత ఏ సినిమా తీయబోతున్నాడు... ఏ సబ్జెక్ట్ ఎంచుకోబోతున్నాడు అన్నదే ఇప్పుడు ఇంట్రస్టింగ్ పాయింట్. ఏ సినిమా చేయబోతున్నాడో రాజమౌళి చెప్పకపోయినా ఏం చేయాలనుకుంటున్నది అనేది మాత్రం చెప్పాడు. నెక్ట్స్ అసలు విజువల్ ఎఫెక్ట్స్ అవసరం లేని సినిమా తీయాలన్నది జక్కన్న ఐడియా. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా ఈ మాట కన్ఫర్మ్ చేశారు.

అయితే రాజమౌళి అభిమానులు మాత్రం ఆయన నుంచి మరిన్ని అద్భుతాలే ఆశిస్తున్నారు. జక్కన్నకు మొదట్లో పేరు తెచ్చిపెట్టిన విక్రమార్కుడు - ఛత్రపతి లాంటి సినిమాలు ఇప్పుడు తీయాలనుకుకోవడం సరికాదని అంటున్నారు. బాహుబలి లాంటి లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ తర్వాత అంతకన్నా బిగ్ కాన్వాస్ నే ఎంచుకోవాలని కోరుకుంటున్నారు. రెండు మూడేళ్లు పట్టినా అలాంటి సినిమాలే తీయాలంటున్నారు. హాలీవుడ్ లో ప్రఖ్యాత దర్శకులైన స్టీవెన్ స్పీల్ బర్గ్ జేమ్స్ కెమెరాన్ తరహాలో ఇటు ప్రేక్షకులను ఆకట్టుకునేలా.. అటు విమర్శకులను మెప్పించేలా రాజమౌళి సినిమాలు ఉండాలన్నది అభిమానుల ఆశ. మన దేశంలో యుద్ధగాథలు - చారిత్రక అంశాలతో ముడిపడి ఉన్న కథలు చాలానే ఉన్నాయి. వాటిపై సినిమాలు వచ్చింది తక్కువే. సైన్స్ ఫిక్షన్ తో వచ్చే సినిమాలు మరీ తక్కువ. ఇలాంటి వాటిపై జక్కన్న ఫోకస్ పెడితే అవార్డులు..  రివార్డులు రెండూ సొంతమవుతాయని అంటున్నారు.

లేదు ఒకవేళ కమర్షియల్ అంశాలనే ఎంచుకోవాలని రాజమౌళి భావిస్తే సూపర్ మాన్ తరహా క్యారెక్టర్ లను క్రియేట్ చేసి సిరీస్ గా సినిమాలు చేయాలన్నది అభిమానుల ఆశ. ఇంతవరకు ఆ తరహా ప్రయత్నం చేసి హిట్ కొట్టింది హృతిక్ రోషన్ మాత్రమే. అతడు చేసిన క్రిష్ పాత్ర ప్రేక్షకులను ఎంతో మెప్పించింది. ఏదేమైనా రాజమౌళి సాదాసీదా సినిమాలకు పరిమితం అయిపోకూడదనే అభిమానులు కోరుకుంటున్నారు. హాలీవుడ్ స్థాయి సినిమాలు మనమూ తీయగలమని నిరూపించిన జక్కన్న సింపుల్ గా సరిపెడతామంటే ఎలా అంటున్నారు. ఈ విషయాలన్నీ రాజమౌళి చెవిన పడ్డాయో లేదో... వేచి చూద్దాం.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/