వచ్చే ఏడాదే.. సినిమా పట్టాలెక్కేది

Thu Oct 12 2017 11:30:22 GMT+0530 (IST)

బాహుబలి తో ఒక్కసారిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి ప్రస్తుతం ఏం చేస్తున్నాడనేది ఎవ్వరికి అర్ధం కావడం లేదు. ఒక కథ కోసం ఐదేళ్లు కష్టపడి రెస్ట్ తీసుకుంటున్నాడని కొందరు అంటుంటే మరికొందరు నెక్స్ట్ సినిమా కోసం బ్యాక్ గ్రౌండ్ వర్క్ జరుగుతోందని కామెంట్స్ చేస్తున్నారు. జక్కన్న సినిమా స్టార్ట్ చేస్తేనే ఏళ్లు గడుస్తుంది. ఇక ఆయన ఏ సినిమా తీయాలా అని ఆలోచిస్తున్నాడంటే ఎంత సమయం పడుతుందో అని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.బాహుబలి కంటే ముందు ఎప్పుడు ఇటువైపు కూడా చూడని బాలీవుడ్ మీడియా బాహుబలి సృష్టించిన రికార్డుల తర్వాత టాలీవుడ్ పై ఓ కన్నేసి ఉంచింది. జక్కన్న ఏ సినిమా తీస్తాడు అన్నది వారిలో కూడా చాలా ఆసక్తిని రేపుతోంది. కానీ రాజమౌళి మాత్రం ఇంతవరకు తన నిర్ణయాన్ని చెప్పలేదు. అయితే కొన్ని రోజులుగా అయన ధనుష్ తో ఓ ప్రయోగాత్మకమైన సినిమాను ప్లాన్ చేస్తున్నారని వార్తలు బాగానే వచ్చాయి. కానీ అది నిజమో కాదో ఎవ్వరికి తెలియదు.

ఇక మెగా ఫ్యామిలీతో ఆయన సాన్నిహిత్యాన్ని చూసి రామ్ చరణ్ తో ఒక సినిమా తప్పకుండా ఉంటుందని కూడా వార్తలు వచ్చాయి. ఆ విషయం పై కూడా రాజమౌళి క్లారిటిని ఇవ్వలేదు. ఇలా ఎన్ని రూమర్స్ వినపడుతున్నా జక్కన్న మాత్రం నెక్స్ట్ సినిమా ఏది అనే విషయంలో సస్పెన్స్ ని భారీగానే చూపిస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే రాజమౌళి నెక్స్ట్ సినిమాను వచ్చే ఏడాదిలోనే కూల్ గా స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.