Begin typing your search above and press return to search.

ఆ దోపిడీ గురించి జ‌క్క‌న్న మాట్లాడ‌డా?

By:  Tupaki Desk   |   24 April 2017 9:17 AM GMT
ఆ దోపిడీ గురించి జ‌క్క‌న్న మాట్లాడ‌డా?
X
సినిమా అంటే వ్యాపార‌మే. ఆ మాట‌లో మ‌రో మాట‌కు తావు లేదు. సినిమాను క‌ళ‌గా.. మ‌రొక‌టిగా ఎంత చెప్పినా.. అంతిమంగా డ‌బ్బుల లెక్క‌ల ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే ఆగుతుంది. వెండితెర అద్భుతంగా బాహుబ‌లిని కీర్తిస్తూ.. అంత గొప్ప ఇంత గొప్ప అని చెప్పినా.. అదంతా కూడా భారీ వ్యాపారానికి టార్గెట్ చేసిందే త‌ప్పించి మ‌రొక‌టి కాద‌ని చెప్ప‌లేం. కాకుంటే.. భారీ రిస్క్ తీసుకొని సినిమా తీసే ధైర్యాన్ని.. సాహ‌సాన్ని మాత్రం అభినందించ‌కుండా ఉండ‌లేం. త‌న సినిమాకు ఏ చిన్న అన్యాయం జ‌రిగినా రాజ‌మౌళి ఫీల్ అవుతారు. దాన్ని త‌ప్పుప‌ట్ట‌లేం కూడా.

కానీ.. త‌నకు జ‌రిగే అన్యాయం మీద అంత‌గా రియాక్ట్ అయ్యే రాజ‌మౌళి.. త‌న సినిమా పేరుతో.. ప్రేక్ష‌కుల్ని దోచుకునే తీరు మీద రియాక్ట్ కారా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. బాహుబ‌లి సినిమా మీద ఉన్న క్రేజ్ ను ఆస‌రా చేసుకొని.. ప‌లు థియేట‌ర్లు.. మల్టీఫ్లెక్స్ లు కొత్త త‌ర‌హా దందాకు కార్పొరేట్ రేంజ్లో తెర తీయ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఒక సినిమా మీదున్న క్రేజ్‌ ను క్యాష్ చేసుకోవ‌టానికి ధియేట‌ర్లు.. మల్టీఫ్లెక్స్‌లు అనుస‌రిస్తున్న తీరుతో స‌గ‌టు ప్రేక్ష‌కుడు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. టికెట్‌ తో పాటు.. ఫుడ్‌ ను బ‌లంతంగా కొనిపించేందుకు ఎత్తులు వేస్తున్న వైనాన్ని ఖండించేది ఎవ‌రు? అన్న‌ది పెద్ద ప్ర‌శ్న‌.

బాహుబ‌లి మీదున్న క్రేజ్‌ ను క్యాష్ చేసుకునేందుకు.. కార్పొరేట్‌ బుకింగ్ పేరుతో భారీ ధ‌ర‌ల‌కు టికెట్ల‌ను అమ్మేస్తున్న వైనం చూసిన‌ప్పుడు స‌గ‌టు ప్రేక్ష‌కుడికి ఒళ్లు మండిపోతున్న ప‌రిస్థితి. కూల్ డ్రింక్‌.. పాప్ కార్న్ తో పాటు స‌మోసాలు క‌లిపి అందిస్తామ‌ని చెబుతూ.. మామూలు టికెట్ కు అద‌నంగా ఛార్జ్ చేసేసి.. హోల్ సేల్ గా అమ్మేస్తున్న వైనంపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తున్నాయి. మామూలుగా మల్టీఫ్లెక్స్‌లో టికెట్ రూ.150 ఉంటే.. కాంబో ఆఫ‌ర్ పేరిట అంతేకాదు.. బాహుబ‌లి పేరుతో ప్రేక్ష‌కుడి జేబుకి చిల్లుపెట్టే వ్య‌వ‌హారాల్ని జ‌క్క‌న్న త‌న లెవ‌ల్ లో రియాక్ట్ అవ్వాల‌న్న సూచ‌న చేస్తున్నారు.

నిజానికి ఈ త‌ర‌హా వ్యాపారానికి నిబంధ‌న‌లు ఒప్పుకుంటాయా? అంటే లేద‌ని చెప్పాలి. చ‌ట్టం ప్ర‌కారం చూసినా.. కొంద‌రు థియేట‌ర్‌.. మల్టీఫ్లెక్స్ ల యాజ‌మాన్యాల తీరు త‌ప్పేన‌ని చెబుతున్నారు. సినిమాటోగ్ర‌ఫీ చ‌ట్టం ప్ర‌కారం ఒక వ్య‌క్తికి రెండు లేదంటే నాలుగు టికెట్ల‌ను మాత్ర‌మే బుకింగ్ కౌంట‌ర్ ద్వారా అమ్మాల‌నే రూల్స్ ఉన్నాయని చెబుతున్నారు. కార్పొరేట్ షో వేసుకోవాలంటే న‌గ‌ర క‌మిష‌న‌ర్ లేదంటే డీసీపీనుంచి అనుమ‌తి తీసుకోవాలంటున్నారు. బాహుబ‌లి టికెట్ల దందా మీద వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై అధికారులు వెంట‌నే స్పందించాల‌ని కోరుతున్నారు.

త‌న సినిమా కార‌ణంగా వేలాది మంది ప్రేక్ష‌కులు.. దోపిడీకి గురి కావ‌టం మీద రాజ‌మౌళి మాట్లాడాల‌ని ప‌లువురు కోరుతున్నారు. అయితే.. అందుకు భిన్నంగా జ‌క్క‌న్న కామ్ గా ఉండ‌టాన్ని చూసిన కొంద‌రు.. త‌న సినిమా.. త‌న లాభాలు త‌ప్పించి.. స‌గ‌టు ప్రేక్ష‌కుడు రాజ‌మౌళికి ప‌ట్ట‌దా? అన్న సందేహాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు. కొన్నేళ్లుగా ప‌డిన క‌ష్టాన్ని.. వీలైనంత త్వ‌ర‌గా క్యాష్ చేసుకోవాల‌న్నట్లుగా జ‌క్క‌న్న న‌యా దందా త‌న‌కేమీ ప‌ట్ట‌న‌ట్లుగా ఉంటారా? లేక‌.. త‌న సినిమాతో స‌గ‌టు ప్రేక్ష‌కుడికి న‌ష్టం వాటిల్ల‌కుండా నోరు విప్పుతారా? అన్న‌ది చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/