Begin typing your search above and press return to search.

రాజమౌళి కథ సరే.. హీరో ఎవరు?

By:  Tupaki Desk   |   30 April 2017 12:43 PM GMT
రాజమౌళి కథ సరే.. హీరో ఎవరు?
X
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలిసిపోయింది. ఈ ప్రశ్నకు ప్రేక్షకులకు సంతృప్తికర సమాధానమే ఇచ్చాడు రాజమౌళి. ఐతే ఇప్పుడు భారతీయ ప్రేక్షకుల్ని వేధిస్తున్న కొత్త ప్రశ్న.. రాజమౌళి తర్వాతి సినిమా ఏంటి అనేదే. ఒక సినిమాకు.. ఇంకో సినిమాకు రాజమౌళి గ్యాప్ తీసుకుంటాడన్న మాట వాస్తవమే కానీ.. ఒక సినిమా పూర్తయ్యే సమయానికే.. తర్వాతి సినిమా ఏంటన్న విషయంంలో ఒక క్లారిటీకి వచ్చేస్తుంటాడు. కొంచెం గ్యాప్ తీసుకుని కొత్త సినిమా పనులు మొదలుపెడుతుంటాడు. ఐతే ‘బాహుబలి’ తర్వాతి సినిమా విషయంలో మాత్రం ఇప్పటిదాకా జక్కన్నకు అసలు ఐడియానే లేదు.

ముందు భూటాన్లో వెకేషన్.. రెండు నెలల తర్వాతే కొత్త సినిమా ఆలోచన చేస్తానని అనేసి వెళ్లిపోయాడు రాజమౌళి. కథ విషయంలో తాను బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదని.. తన తండ్రి దగ్గర బోలెడన్ని కథలున్నాయని.. వాటిలో తనకు నచ్చింది తీసి సినిమా చేసుకుంటానని కూడా చెప్పాడు జక్కన్న. ఐతే కథ ఎలాగోలా తయారైపోతుంది కానీ.. ఇంతకీ ఆ కథలో హీరో ఎవరన్నదే ఇప్పుడు సస్పెన్స్. రాజమౌళి అడగాలే.. మన స్టార్ హీరోల్లో ఎవ్వరైనా తనతో సినిమా చేయడానికి సిద్ధం. వేరే కమిట్మెంట్లను పక్కన పెట్టయినా జక్కన్నతో సినిమా చేస్తారు.

జక్కన్నతో సినిమా చేయాలని ఎక్కువ ఆశపడుతున్న వాళ్లలో ఎన్టీఆర్ ఒకడు. ఇప్పటికే రాజమౌళితో మూడు సినిమాలు చేసిన ఎన్టీఆర్.. మళ్లీ తన జక్కన్నతో జట్టు కట్టాలని ఆశపడుతున్నాడు. ఈ ఆశను బహిరంగంగానే వ్యక్త పరిచాడు. ఇక రాజమౌళితో ఒక్క సినిమా కూడా చేయని అల్లు అర్జున్ కూడా.. దర్శక ధీరుడితో సినిమా కోసం ఆసక్తి కనబరుస్తున్నాడట. మహేష్ బాబు కూడా ఆసక్తి లేకపోలేదు. రాజమౌళి అడగాలే కానీ.. పవన్ కళ్యాణ్ అయినా ఓకే అంటాడేమో. ఇంకా చిన్నా పెద్దా అని తేడా లేకుండా చాలామంది స్టార్లు రాజమౌళితో సినిమా అంటే మరో మాట లేకుండా ఒప్పుకుంటారు. ఐతే ఇప్పుడు రాజమౌళిపై అన్ని భాషల ప్రేక్షకుల్లోనూ అంచనాలు పెరిగిపోయాయి. అతడి సినిమా ఏ ఒక్క భాషకో పరిమితం అయ్యేది కాదు. కాబట్టి రాజమౌళి ఏ బాలీవుడ్ హీరోనో లేదా రజినీకాంత్ లాంటి హీరోనో పెట్టి.. పాన్ ఇండియా సినిమా తీసినా ఆశ్చర్యం లేదేమో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/