Begin typing your search above and press return to search.

#RRR: జోగి సాయం తీసుకోనున్న జక్కన్న

By:  Tupaki Desk   |   16 Nov 2018 5:29 AM GMT
#RRR: జోగి సాయం తీసుకోనున్న జక్కన్న
X
ఏదో ఒకరోజు సినిమా గురించి అస్సలు ఆలోచించకుండా ఉంటే ఎస్ ఎస్ రాజమౌళికి తోచుబాటు అవుతుందేమో గానీ #RRR అప్డేట్లు రాయకపోతే మాకు.. చదవకపోతే మీకు రోజు గడిచేలా లేదు. ఒక అప్డేట్ తర్వాత మరొకటి వస్తూనే ఉన్నాయి. మరి తాజా అప్డేట్ గురించి మనం చెప్పుకోవాలిగా. ఈ సినిమాకు బాలీవుడ్ క్యాస్టింగ్ టచ్ ఇస్తున్నాడట జక్కన్న.

క్యాస్టింగ్ టచ్ అనగానే బాలీవుడ్ నటులు మన సినిమాల్లో నటించడం కొత్తేమీ కాదుకదా అని నిట్టూర్చాల్సిన పనేలేదు. ప్యాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేసే సినిమాకాబట్టి బాలీవుడ్ నటులు ఎలాగూ ఉండే అవకాశం ఉంది. కానీ అది కాదు ఇక్కడ విషయం. ప్రముఖ బాలీవుడ్ క్యాస్టింగ్ డైరెక్టర్ జోగి మలంగ్ చేతిలో #RRR కు నటీనటులను వెతికిపెట్టే బాధ్యతను పెట్టాడట జక్కన్న. కథకు సరిపోయే హీరోయిన్లతో పాటుగా ఇతర ఆర్టిస్టులందరినీ జోగి మలంగ్ ఆధ్వర్యంలో నడిచే జోగి ఫిలిం క్యాస్టింగ్ కంపెనీనే వెతికిపెడుతుందట. వారు చూపించిన ఆర్టిస్టులను ఫైనలైజ్ చేసేది మాత్రం మన జక్కన్నే.

'NH10'.. 'విక్కీ డోనార్'.. 'రాజీ' సినిమాలకు జోగి చేసిన క్యాస్టింగ్ వర్క్ అందరితో ప్రశంసలు అందుకుంది. రీసెంట్ గా రాజమౌళి #RRR సినిమాకు అవసరమైన పాత్రల వివరాలను జోగి మలంగ్ తో చర్చించడం జరిగిందట. ఈ లెక్కన జోగి గారికి మన మెగా-నందమూరి మల్టిస్టారర్ కథ తెలిసిపోయినట్టే!