Begin typing your search above and press return to search.

#RRR ఓ ప్యాన్ ఇండియన్ ఫిలిం: రాజమౌళి

By:  Tupaki Desk   |   18 Feb 2019 1:36 PM GMT
#RRR ఓ ప్యాన్ ఇండియన్ ఫిలిం: రాజమౌళి
X
ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న #RRR ఇప్పుడు ఇండియాలోనే ఒక క్రేజీ ప్రాజెక్ట్. ఈ సినిమాగురించి అధికారికంగా పెద్దగా అప్డేట్లు బయటకు రావడంలేదని అందరికీ తెలిసిందే. కానీ రీసెంట్ గా రాజమౌళి హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ సినిమా గురించి అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఆ ప్రశ్నలు సమాధానాలు ఒకసారి చూడండి.

* రాజమౌళి సినిమాలంటే అంచనాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఫిలిం మేకింగ్ లో మీకు ప్రెజర్ అనిపిస్తుందా?

లేదు.. ఫిలిం మేకింగ్ అనేది ఎప్పుడూ నాకు ఒత్తిడితో కూడుకున్న విషయం కాదు. అది ఎలాంటి సినిమా అయినా. కానీ సినిమా చివరిదశకు వచ్చేసరికి ప్రెజర్ అనేది వస్తుంది. రిలీజ్ కు ముందుగా ఈ సినిమా హిట్ అవుతుందా లేదా అనే ప్రెజర్ ఉంటుంది. కానీ కథను తయారు చేసుకునే సమయం.. ఫిలిం మేకింగ్ ప్రాసెస్ మాత్రం బెస్ట్ పార్ట్. అసలు ప్రెజర్ ఉండదు. ప్రతి క్షణం ఎంతో గొప్పగా ఉంటుంది. అదో జిగ్ సా పజిల్ లా ఉంటుంది.. అన్నీ పీస్ లను ఒక బొమ్మగా ఎలా చేయాలనే ఫోకస్ ఉంటుంది. ఆ సమయంలో ఈ సినిమాను ఎలా మార్కెట్ చేయాలి.. దేశం లో ఎక్కడికి ఈ సినిమాను తీసుకెళ్ళాలి... ఇలాంటి విషయాల గురించి నేనెక్కువగా ఆలోచించను. అనుభవం ఉంది కాబట్టి మాకు టార్గెట్ ఆడియన్స్ ఎవరు అనే విషయం మాత్రం ఒక రఫ్ ఐడియా ఉంటుంది. సినిమా ఇక రెడీ అవుతుందనే దశలో కమర్షియల్ యాస్పెక్ట్స్ లాంటివి వస్తాయి. కానీ మేకింగ్ సమయంలో మాత్రం సంతోషంగా ఉంటుంది.

*ఇప్పుడు మీరు ఇద్దరు తెలుగు సూపర్ స్టార్లతో చేస్తున్న #RRR కూడా ఒక ప్యాన్ ఇండియన్ ఫిలిమేనా?

అవును. ఈ సినిమా ప్యాన్ ఇండియన్ ఫిల్మే. కారణం ఈ సినిమా కథే.

*ఇది ఫ్యాంటసీ మూవీనా?

అలాంటి ప్రశ్నలు అడగొద్దు(అని నవ్వులో మునిగిపోయారు) కానీ ఇది ప్యాన్ ఇండియన్ ఫిలిం.

*మరి ఈ సినిమా బాహుబలి రేంజ్ లో లార్జ్ స్కేల్ ఉన్న సినిమానా?

అవును. ఇది లార్జ్ స్కేల్ ఉన్న సినిమానే..

*ఒక ఫిలిం మేకర్ గా ఇక్కడ ఉండే వ్యాపార వేత్తలకు మీరిచ్చే సూచన ఏంటి? ఫిలిం ఇండస్ట్రీ నుంచి వారు ఏం నేర్చుకోవాలంటారు? మన కంట్రోల్ లో లేని విషయాలను ఏం చేయాలి.. ప్లానింగ్ ఎలాచేయాలని మీరు సూచిస్తారు?

చాలా విషయాలు మన చేయి దాటిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఒక్క విషయం మాత్రం మనం చేతినుండి దాటిపోనివ్వకూడదు. అది మీ అంకిత భావం.. మీ ఆత్మవిశ్వాసం. ఇవి మీ లోపల ఉండే బలాలు.. మిగతావన్నీ బయట నుంచి వస్తాయి. మీకు కనుక అంకిత భావం.. మీరు చేసేపని పట్ల విశ్వాసం ఉంటే.. మీ టీమ్ కూడా ఆ పనిని నమ్మితే.. మీకు టెంపరరీగా ఇబ్బందులు వచ్చినప్పటికీ వాటిని ఎదుర్కొనే మార్గాలు కూడా కనబడతాయి.