కేజీఎఫ్ యశ్ డ్రైవర్ కొడుకు!

Sun Dec 09 2018 22:59:33 GMT+0530 (IST)

గత కొంతకాలంగా సౌత్ ఇండస్ట్రీ యావత్తూ ఒకే ఒక్క సినిమా గురించి ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. బహుశా బాహుబలి తర్వాత మళ్లీ అంతగా పాపులరైన `2.ఓ` మినహా వేరొక సినిమా ఏదైనా ఉందా? అంటే అది కన్నడ హీరో యశ్ నటించిన `కేజీఎఫ్` అంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమా తొలి టీజర్ చూడగానే ఇంప్రెషన్ కొట్టేశాడు యశ్. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎంచుకున్న కాన్సెప్టు కూడా అంతే వెయిట్ ఉన్నది కావడంతో అన్ని పరిశ్రమల దృష్టి కేజీఎఫ్ పై పడింది. కథానాయకుడు యశ్ రఫ్ & టఫ్ లుక్.. రగ్గుడ్ కంటెంట్ అందరికీ నచ్చింది. కోలార్ బంగారు గనుల్లో మాఫియా అరాచకాలు - బానిసత్వంపై తీసిన ఈ సినిమాలో భారీ యాక్షన్ కి స్కోప్ ఉండడంతో అంచనాలు నింగినంటాయి.సేమ్ టైమ్ ఈ సినిమాలో నటిస్తున్న హీరో యశ్ ఎవరికి చుట్టం? అతడిని నమ్మి `బాహుబలి` అంత భారీ కాన్వాసుతో ఈ చిత్రాన్ని తీస్తున్నారు. అంత పెద్ద బడ్జెట్ పెడుతున్నారట కదా? అంటూ ఆసక్తిగా చర్చ సాగింది. కొందరైతే అతడు కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు `జాగ్వార్` ఫేం నిఖిల్ గౌడకు స్నేహితుడు కజిన్... బిగ్ హ్యాండ్స్ అతడికి అండగా ఉన్నాయంటూ మాట్లాడుకున్నారు. అసలింతకీ యశ్ ఎవరు? అన్న కన్ఫ్యూజన్ ఇప్పటివరకూ అందరిలో ఉంది. ఇదివరకూ ``సలామ్ రాఖీ భాయ్.. `` అంటూ రిలీజైన పాటతో యశ్ గురించి ఎంక్వయిరీలు ఇంకా ఇంకా పెరిగాయి. అసలింతకీ యశ్ ఎవరు? అన్న ప్రశ్నకు దర్శకధీరుడు యస్.యస్.రాజమౌళి `కేజీఎఫ్` ఈవెంట్ లో ఇచ్చిన క్లారిటీతో అందరికీ మతి చెడింది. యశ్ ఓ సాధారణ డ్రైవర్ కొడుకు. కన్నడ పరిశ్రమలో హీరోగా అడుగు పెట్టి ఒక్కో హిట్టు కొడుతూ అంచెలంచెలుగా ఎదిగాడు.

ఇదే విషయంపై రాజమౌళి `కేజీఎఫ్` లైవ్ ఈవెంట్ లో మాట్లాడుతూ -``నాలుగైదేళ్ల క్రితం సాయి గారితో మాట్లాడుతూ కర్నాటకలో సీనేంటి ? ఎవరు టాప్ హీరో? అని అడిగితే .. టాప్ స్టార్స్ కాదండీ.. ఒక కొత్త కుర్రాడు వచ్చాడు.. హిట్టు మీద హిట్టు కొడుతున్నాడు. సక్సెస్ తో అందరినీ దాటేశాడు! అని అన్నారు. ఎవరండీ ఆ కుర్రాడు ? అని అడిగితే .. ఓ బస్ డ్రైవర్ కొడుకు యశ్ అని చెప్పారు`` అని తెలిపారు. తన కొడుకు సూపర్ స్టార్ అయినా కూడా ఇప్పటికీ ఆయన తండ్రి బస్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ``నేను సంపాదించాను కదా నాన్నా.. ఈ ఉద్యోగం ఇక వద్దు!! అని యశ్ తన తండ్రిని అడిగితే..  ``నేను బస్ డ్రైవర్ అయ్యే నిన్ను సూపర్ స్టార్ ని చూశాను. నీ పని నువ్వు చూసుకో... నా పని నేను చూసుకుంటా`` అన్నాడట అంటూ మరో షాకింగ్ విషయాన్ని చెప్పారు రాజమౌళి. ఆ మాటతో యశ్ కంటే అతడి తండ్రి బిగ్ సూపర్ స్టార్ అని అనిపించిందని పొగిడేశారు. ఇది తెలిశాక నిజంగానే యశ్ కి - ఆయన డాడ్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే మరి.