Begin typing your search above and press return to search.

దంగల్ సంచలనాలపై రాజమౌళి ఏమన్నాడంటే..

By:  Tupaki Desk   |   27 Jun 2017 9:22 AM GMT
దంగల్ సంచలనాలపై రాజమౌళి ఏమన్నాడంటే..
X
‘బాహుబలి: ది కంక్లూజన్’ బాక్సాఫీస్ దగ్గర ప్రకంపనలు రేపుతున్న సమయంలో ‘దంగల్’ చైనాలో విడుదలై సంచలనాల మోత మోగించి రాజమౌళి సినిమా విలువను తగ్గించేసింది. ఇండియాస్ హైయెస్ట్ గ్రాసర్ అన్న ట్యాగ్ లైన్‌ ‘బాహుబలి-2’కు మూణ్నాళ్ల ముచ్చటే అయింది. ‘దంగల్’ ఓవరాల్ కలెక్షన్లు ‘బాహుబలి-2’ను దాటేశాయి. ఇప్పుడు రూ.2 వేల కోట్ల మార్కుతో ‘బాహుబలి-2’ కన్నా పైన నిలబడింది ‘దంగల్’. ఇది ‘బాహుబలి’ మేకర్స్ కు మింగుడు పడని విషయమే. ఐతే రాజమౌళి మాత్రం ‘దంగల్’ను తక్కువ చేసి మాట్లాడలేదు. దాని గురించి పాజిటివ్ గానే స్పందించాడు. చైనాలో ‘దంగల్’ ఊపు తమ సినిమాకు కలిసొస్తుందని రాజమౌళి ఆశాభావం వ్యక్తం చేశాడు.

చైనాలో దంగల్ సాధించిన అద్భుత విజయం వల్ల ఇండియన్ సినిమాలకు మేలు జరుగుతుందని.. దాని తర్వాత అంత భారీ స్థాయిలో చైనాలో విడుదల కాబోతున్న ‘బాహుబలి-2’కు కలిసొస్తుందని అన్నాడు జక్కన్న. ‘బాహుబలి-1’తో పోలిస్తే.. రెండో భాగంపై చైనా ప్రేక్షకుల్లో ఆసక్తి ఎక్కువ ఉందని అంచనా వేస్తున్నట్లు రాజమౌళి చెప్పాడు. దంగల్ కంటే ఇండియాలో ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాగా ‘బాహుబలి-2’ను చైనాలో ప్రత్యేకంగా చూస్తారని రాజమౌళి ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ సినిమాకు తాము ఆశించిన స్థాయిలో భారీగానే థియేటర్లు దక్కుతున్నాయని.. మంచి టైమింగ్‌ లో సరిగ్గా సినిమాను రిలీజ్ చేసేందుకు స్థానిక డిస్ట్రిబ్యూటర్ సన్నాహాలు చేస్తున్నాడని.. ‘బాహుబలి-2’కు మంచి వసూళ్లు వస్తాయని ఆశిస్తున్నట్లు జక్కన్న ఆశాభావం వ్యక్తం చేశాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/