Begin typing your search above and press return to search.

క్రిష్ మీద రాజమౌళికి ఇంత అభిమానమా?

By:  Tupaki Desk   |   22 Jan 2017 7:50 AM GMT
క్రిష్ మీద రాజమౌళికి ఇంత అభిమానమా?
X
‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా చూడటం ఆలస్యం.. ఆ సినిమాను ప్రశంసిస్తూ ట్వీట్లు గుప్పించేశాడు రాజమౌళి. ఆ తర్వాత క్రిష్ ను స్వయంగా ఇంటర్వ్యూ చేసి ఆశ్చర్యపరిచాడు. ఆ సందర్భంగా శాతకర్ణి గురించి.. క్రిష్ గురించి గొప్పగా మాట్లాడాడు జక్కన్న. ఈ ప్రశంసల వర్షాన్ని అంతటితో ఆపేయలేదు రాజమౌళి. స్వయంగా క్రిష్ ను ఉద్దేశించి ఓ బహిరంగ లేఖ కూడా రాశాడు. అది ఓ ప్రముఖ పత్రికలో ప్రచురితమైంది. ఇంతకుముందు క్రిష్ తో కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన విషయాల్నే ప్రస్తావిస్తూ అతడి గురించి మరింత గొప్పగా మాట్లాడాడు జక్కన్న.

బాలయ్య-క్రిష్ లది బ్యాడ్ కాంబినేషన్ అని తాను భావించిన విషయాన్ని మరోసారి గుర్తు చేశాడు రాజమౌళి. ఈ సినిమా మొదలవుతున్ననపుడు తనకు ఎన్నెన్నో సందేహాలు కలిగినట్లు రాజమౌళి చెప్పాడు. ‘‘బాలయ్య-క్రిష్ కాంబినేషన్ అనగానే ఆశ్చర్యం కలిగింది. పైగా ఇది చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రం. అసలీ శాతకర్ణి గురించి చరిత్రలో ఎంతమందికి తెలుసు? ఆ మాటకొస్తే నాకూ కొంతే తెలుసు. పాఠ్యాంశాల్లో నాలుగంటే నాలుగులైన్లు... నాసిక్‌ లో ఓ శాసనం. మళ్లీ ఆశ్చర్యపోయా. కథ ఎక్కడ నుంచి తెస్తారు? ఎన్నాళ్లని పరిశోధిస్తారు? దానికే యేడాది పడుతుందేమో అని లెక్కలేశా. సరే... శోధిస్తారు, సాధిస్తారు అనుకొందాం. తెలియని చక్రవర్తి చరిత్రని ప్రేక్షకులు ఏమంత ఆదరిస్తారు.

ఇక ఈ సినిమా అయినట్టే అనుకున్నా. ఇలా అనుకొంటుండగానే షూటింగ్‌కి వెళ్లారని తెలిసింది. మళ్లీ ఆశ్చర్యం కలిగింది. మొరాకో అన్నారు... జార్జియా అన్నారు... మధ్యప్రదేశ్‌లోని మహేశ్వరమన్నారు.. ఇలా మొదలెట్టారో లేదో అప్పుడే అయిపోయిందని వార్త విన్నా. ఈసారి ఆశ్చర్యానికే ఆశ్చర్యం వేసింది. ప్రారంభించిన 79 రోజుల్లోనే గుమ్మడి కాయ కొట్టడమేంటి? నాకు నమ్మబుద్ధి కాలేదు. అసలు వీళ్లేం రాశారూ... వీళ్లేం తీశారు... అని ఈసారి ఇంకా గట్టిగా అనిపించింది. పైగా మొదటి శతాబ్దపు యుద్ధ కథ అని విన్నాను. షూటింగ్‌ ఎలా ప్లాన్‌ చేశారు..? ఎవరు డిజైన్‌ చేశారు..? సెట్స్‌ ఎక్కడ వేశారు? ఒక యుద్ధం ఎన్ని రోజుల్లో తీశారు..? ఇంత తక్కువ సమయంలో విజువల్‌ ఎఫెక్ట్స్‌ కూడా పూర్తి చేసి ఎలా రిలీజ్‌ చేశారు? ఇలా అన్నీ అనుమానాలే’’ అంటూ తన సందేహాల చిట్టా గురించి వివరించాడు.

ఇక తనకు సినిమా చూసిన రోజు కలిగిన అనుభూతి గురించి రాజమౌళి చెబుతూ.. ‘‘12వ తారీఖు... తెల్లవారుజామున అభిమానులతో పాటు నేనూ సినిమా చూశా. అప్పటి వరకూ ఉన్న ఆశ్చర్యాలు, అనుమానాలూ అద్భుతాలుగా మారాయి. రెండు గంటల పాటు మొదటి శతాబ్దంలోకి వెళ్లొచ్చిన భావన. అక్కడుంది నాకు తెలిసిన బాలయ్య కాదు... సాక్షాత్తూ శకపురుఫుడు సార్వభౌమ శాతకర్ణి. 'సమయం లేదు మిత్రమా..' అని చెప్పినప్పుడల్లా సగటు అభిమానిలానే నా గుండె కూడా పులకరించింది. యుద్ధరంగంలో బాలయ్య గుర్రం మీద కూర్చుని పిల్లాడు చెప్పిన కథ వింటాడు చూడండి... హీరోయిజం నాకు ఇంకో కోణంలో కనిపించింది. చరిత్ర అంటే డాక్యుమెంటరీలా తీస్తారనుకొంటే... మీరు దాన్ని అచ్చమైన కమర్షియల్‌ చిత్రంగా మలిచారు. నాలాంటి ఎంతోమంది హృదయాల్ని గెలిచారు. ప్రతీ మాటా... ప్రతీ సన్నివేశం, ప్రతీ మలుపూ కదిలించింది. తెలుగువాడిగా మీసం మెలేయాలనిపించేలా చేసింది. యుద్ధంలో హింస, రక్తపాతం ఉంటాయి. కానీ మీ యుద్ధంలో భావోద్వేగాలు కనిపించాయి. భావోద్వేగాలతో సాగే సన్నివేశాలూ యుద్ధంలానే ఉన్నాయి. కావ్యాల్లాంటి దృశ్యాలన్నీ కలిసిన దృశ్యకావ్యం. ఈ సినిమా కథ చరిత్ర... ఈ సినిమా తీసిన విధానం ఒక చరిత్ర.. ఈ సినిమా తీయాలన్న ఆలోచన రావడమే ఓ చరిత్ర. మా భ్రమల్ని పటాపంచలు చేసిన మీకూ.. మీతో పాటు ఓ సైన్యంలా పనిచేసిన చిత్రబృందానికీ, మరీ ముఖ్యంగా వందో చిత్రం కోసం ఇంత గొప్ప కథని ఎంచుకొన్న బసవరామ తారక పుత్ర బాలకృష్ణగారినీ మనసారా అభినందనలు’’ అంటూ ముగించాడు రాజమౌళి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/