Begin typing your search above and press return to search.

ఆర్ ఆర్ ఆర్.. ఆ మాటలు నమ్మొచ్చా?

By:  Tupaki Desk   |   12 Nov 2018 8:23 AM GMT
ఆర్ ఆర్ ఆర్.. ఆ మాటలు నమ్మొచ్చా?
X
బాహుబలి’ తర్వాత రాజమౌళి ఎలాంటి సినిమా చేస్తాడు.. ఎవరితో చేస్తాడని తీవ్ర ఉత్కంఠ నెలకొంది జనాల్లో. ఈ ఉత్కంఠకు గత ఏడాదే తెర దించేశాడు జక్కన్న. జూనియర్ ఎన్టీఆర్-రామ్ చరణ్‌ ల కలయికలో మల్టీస్టారర్ తీయబోతున్నట్లు వెల్లడించాడు. ఈసారి గ్రాఫిక్స్.. విజువల్ ఎఫెక్ట్స్‌ తో పని లేకుండా మామూలు సినిమా తీయబోతున్నట్లు ముందే ప్రకటించాడు. అలా అని దీని స్కేల్ ఏమీ తక్కువగా ఉండేలా లేదు. స్క్రిప్ట్ వర్క్.. ప్రి ప్రొడక్షన్ కోసం ఏడాది సమయం వెచ్చించడాన్ని బట్టి ఇది కూడా జక్కన్న రేంజికి తగ్గ సినిమానే అవుతుందని జనాలు ఆశిస్తున్నారు. నిజానికి ఈ చిత్రం ఈ ఏడాది మధ్యలోనే మొదలవుతుందన్నారు. కానీ ఇయర్ ఎండింగ్‌ లో కానీ సెట్స్ మీదికి వెళ్లట్లేదు. ప్రారంభోత్సవం సందర్భంగా చిత్ర బృందం.. 2020 వేసవి విడుదల అని ప్రకటించింది.

కానీ నిజంగా ఆ సమయానికి సినిమా వస్తుందా అని జనాల్లో డౌట్లు మొదలైపోయాయి. రాజమౌళి దర్శకుడిగా ఒక స్థాయిని అందుకున్నాక ఏ సినిమా కూడా అనుకున్న ప్రకారం పూర్తయి.. ముందు చెప్పిన సమయానికి రిలీజైంది లేదు. ఒక చిన్న సన్నివేశం విషయంలో కూడా రాజీ పడని మనస్తత్వం రాజమౌళిది. కాబట్టి షూటింగ్ ఆలస్యం కావడం అన్నది సహజమైన విషయం. ‘బాహుబలి: ది బిగినింగ్’.. ‘బాహుబలి: ది కంక్లూజన్’ సినిమాల విషయంలో ఎంత ప్లానింగ్ తో ఉన్నప్పటికీ రెండు సినిమాలూ ఆలస్యమయ్యాయి. అనుకున్నదాని కంటే ఆలస్యంగానే విడుదలయ్యాయి. కాబట్టి ‘ఆర్ఆర్ఆర్’ మాత్రం షెడ్యూల్ ప్రకారం షూటింగ్ పూర్తి చేసుకుని.. 2020లోనే విడుదలవుతుందన్న గ్యారెంటీ ఏమీ లేదు. జక్కన్న సినిమా అంటే నిర్మాతలు చెప్పే డెడ్ లైన్ కి జనాలు కనీసం ఆరు నెలలైనా కలుపుకుంటారు. ‘ఆర్ఆర్ఆర్’ విషయంలోనూ అలాగే ఆలోచిస్తున్నారు. 2020 చివరికి ఫిక్సయిపోతున్నారు.