Begin typing your search above and press return to search.

పైరసీ.. జోక్‌.. అంటున్న రాజమౌళి

By:  Tupaki Desk   |   3 Sep 2015 6:37 PM GMT
పైరసీ.. జోక్‌.. అంటున్న రాజమౌళి
X
ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి 600 కోట్లు వసూలు చేసి దేశంలోనే టాప్‌-3 స్థానంలో నిలిచింది. ఈ సినిమా షూటింగ్‌ లో ఉండగానే పైరసీ వీడియో ఆన్‌ లైన్‌ లో రిలీజైంది. సినిమా రిలీజైన వారంలోనే పైరసీ మార్కెట్లోకి వచ్చేసింది. అయినా ఇంత పెద్ద స్థాయి విజయం సాధించడం ఓ రికార్డ్‌.

రాజమౌళి ఏం చేసినా ఎంతో జాగ్రత్తగా చేస్తాడు. అయినా అతడి పప్పులు ఉడకనేలేదు. పైరేట్‌లు విజృంభించి ఆన్‌లైన్‌ లో పైరసీ సినిమాని రిలీజ్‌ చేశారు. పైరేటెడ్‌ వెబ్‌లింక్స్‌ ని మూయించేసేందుకు పోలీస్‌ తో కలిసి రాజమౌళి విశ్వప్రయత్నం చేసినా నిలువరించలేకపోయాడు. ఇదే విషయమై రాజమౌళి ట్విట్టర్‌ లో ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశంలో ఎన్‌ఫోర్స్‌ మెంట్‌, చట్టాలు పనిచేయవు.. చట్టాలు అమల్లో పెట్టడం పెద్ద జోక్‌ అంటూ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారాయన.

దానికి సమాధానంగా అభిమానులు సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వారం కిందటే ఈసీఐఎల్‌ లో రోడ్డుపై పెట్టి సీడీల్ని అమ్మేస్తున్నారు అంటూ ఓ అభిమాని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎక్కడ పడితే అక్కడ బాహుబలి సీడీలు అంటూ బాధను వ్యక్తం చేశారు. పైరసీని ఆపడం అంటే ఆకాశానికి నిచ్చెన వేయడమే అన్నట్టు ఉంది పరిస్థితి. ఎప్పటికి పరిష్కారం వస్తుందో?