Begin typing your search above and press return to search.

కిలోమీట‌ర్ల క్యూలతో జ‌క్క‌న్న‌కు గ‌ర్వమేన‌ట‌

By:  Tupaki Desk   |   27 April 2017 5:46 AM GMT
కిలోమీట‌ర్ల క్యూలతో జ‌క్క‌న్న‌కు గ‌ర్వమేన‌ట‌
X
త‌మ‌కు ఎలాంటి ఆర్థిక‌ప‌ర‌మైన సంబంధాలు లేకున్నా.. ప్ర‌తిఒక్క తెలుగోడు త‌మ వాడి సినిమాగా ఫీలైంది ఏమైనా ఉందంటే.. అది బాహుబ‌లే అవుతుందేమో. ఒక తెలుగోడు సాహ‌సంతో సినిమా తీస్తున్నాడు.. భారీ బడ్జెట్‌తో మూవీ తీస్తున్నాడ‌న‌గానే.. అంత బ‌లుపు అవ‌స‌ర‌మా? అన్న ఫీలింగ్ లేకుండా.. మ‌నోడి సినిమాకు మ‌న వంతు బాధ్య‌త‌గా అన్న ఫీలింగ్ తోబాహుబ‌లిని ఆద‌రించార‌ని చెప్పాలి. రెండేళ్ల క్రితం బాహుబ‌లి మూవీ రిలీజ్‌కు రెండు మూడు రోజ‌ల ముందు ప్ర‌తి తెలుగోడు.. ఈ సినిమా బాగుండాల‌ని..సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వాల‌ని కోరుకున్న వారే. తెలుగోడి గొప్ప‌త‌నాన్ని ప్ర‌పంచానికి చాట‌టానికి తెలుగోళ్లంతా స‌మైక్యంగా.. సోద‌ర‌భావంతో నిలిచిన అపూర్వ‌మైన ఘ‌ట్టం బాహుబ‌లి సంద‌ర్భంగా ఆవిష్కృత‌మైంద‌ని చెప్పాలి.

తెలుగోళ్ల భుజాల మీద ఇంత భారీగా ఎక్కి తిరిగిన బాహుబ‌లి.. ఈ రోజు.. అదే తెలుగోళ్లు.. అదే తెలుగు మీడియా జ‌క్క‌న్న అండ్ కోకు అస్స‌లు క‌నిపించ‌టం లేద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. త‌న‌కు ఫైనాన్స్ చేసిన‌.. ఒక అగ్ర‌శ్రేణి మీడియాలోత‌న సినిమా ముచ్చ‌ట్లు వ‌స్తే చాటు.. సినిమా హిట్ అయిపోతుంద‌న్న భావ‌మో.. లేక‌.. హిందీ.. విదేశీ భాష‌ల్లో మూవీని భారీగా మార్కెట్ చేసుకుంటే స‌రిపోతుంది.. అక్క‌డి మీడియాతో మాట్లాడితే చాల‌న్న ఫీలింగో కానీ.. సినిమా విడుద‌లకు రెండు రోజుల ముందు కానీ తెలుగు మీడియాతో మాట్లాడే టైం చిక్కింది జ‌క్క‌న్న‌కు.

ఆయ‌న మొద‌టిసినిమా నుంచి తెలుగు మీడియా ఎంత ప్ర‌మోట్ చేసింద‌న్న విష‌యాన్ని రాజ‌మౌళి మ‌ర్చిపోవ‌టం పెద్ద విశేషం కాద‌నే చెప్పాలి. ఏమైనా.. తెలుగోళ్ల‌ను జ‌క్క‌న్న‌ లైట్ తీసుకుంటున్నాడ‌న్న ఫీలింగ్ ను క‌లిగించిన ఆయ‌న‌.. ఆ ముద్ర‌ను పోగొట్టుకోవ‌టానికి తెలుగు మీడియా ప్ర‌తినిధులంద‌రికి క‌లిపి హోల్ సేల్ గా ఇంట‌ర్వ్యూ ఇచ్చేశారు.

ఈ సంద‌ర్భంగా చాలానే ముచ్చ‌ట్లు చెప్పుకొచ్చారు. బాహుబ‌లి రిలీజ్ వేళ‌.. ఆ సినిమా టికెట్ల కోసం కిలోమీట‌ర్ల కొద్దీ క్యూ లైన్లుక‌నిపిస్తున్న స‌మ‌యాన‌.. మీ సినిమా టికెట్ల కోసం మంత్రులు.. క‌లెక్ట‌ర్లు సైతం వంద‌ల‌కొద్దీ టికెట్ల‌ను ముందే కొనేశార‌న్న వార్త‌ల నేప‌థ్యంలో ఎలా ఫీల్ అవుతున్నార‌న్న మీడియా ప్ర‌శ్న‌కు త‌న‌దైన స్టైల్లో బ‌దులిచ్చారు రాజ‌మౌళి.

చిన్న‌ప్ప‌టి నుంచీ చాలానే క్యూలు థియేట‌ర్ల ముందు క‌నిపిస్తున్నాయ‌ని.. భారీ అంచ‌నాల‌తో వ‌చ్చే ఏసినిమాకైనా సామాన్య ప్రేక్ష‌కుడి నుంచి ప్ర‌భుత్వాధికారుల వ‌ర‌కూ టికెట్ల కోసం డిమండ్ ఎక్కువేన‌ని.. కాక‌పోతే.. దీనికి మ‌రింత ఎక్కువ‌గా ఉంద‌ని.. ఇదంతా చూసిన‌ప్పుడు కాస్త గ‌ర్వంగానూ.. ఇంకాస్త బాధ్య‌త‌గా ఉంటుంద‌న్నారు. ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకొని ప‌ని చేయాల‌నే విష‌యాన్ని గుర్తు పెట్టుకుంటాన‌న్నారు. ఇలా ప్ర‌శ్న‌లు.. స‌మాధానాలు సాగిన జ‌క్క‌న్న ఇంట‌ర్వ్యూలోని ముఖ్యాంశాల్ని చూస్తే..

= సినిమా చేస్తున్నంత‌సేపు ఆత్రంగా ఉంటుంద‌ని.. ప‌ని పూర్తి అయ్యాక ఉత్కంఠ మొద‌ల‌వుతుంది. ఇప్పుడు అలాంటి ప‌రిస్థితే ఉంది.

= క‌థ‌లో ఎలాంటి మార్పులు చేయ‌లేదు. చెప్పాల‌నుకున్న‌క‌థ‌ను ఒక భాగంగా చెప్పేలం కాబ‌ట్టి.. రెండు భాగాలుగా చెప్పాల‌నుకున్నాం. మొద‌టి భాగంతో స‌గం చెప్పాం. రెండోభాగంలో మిగితాది చెప్పాల‌నుకున్నా. క‌థ‌ను ఎలాంటి మార్పు చేయ‌లేదు.కాక‌పోతే.. క‌మ‌ర్షియ‌ల్ గా కాసిన్ని హంగులు జోడించాం.

= బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప ఎందుకు చంపాడ‌న్న ప్ర‌శ్న ఓ మంచి మ‌లుపుగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అనుకున్నామే కానీ.. అదో ఆటంబాంబులా పేలింది. ఒక ప్ర‌శ్న ప్రేక్ష‌కుల్లో ఇంత‌గా నానుతుంద‌ని అస్స‌లు ఊహించ‌లేదు. ఈ ప్ర‌శ్న‌కు మ‌లిభాగంలో స‌మాధానం చెప్పేందుకు తీర్చిదిద్దిన స‌న్నివేశాల్లో మాత్రం ప్రేక్ష‌కులు నూటికి నూరు శాతం సంతృప్తి చెంద‌డం ఖాయం.

= ఒక‌సినిమాకు ఐదేళ్లు టైం తీసుకుంటుంద‌ని అస్స‌లు అనుకోలేదు. రంగంలోకి దిగాకే తెలిసి వ‌చ్చింది. కానీ.. తిరిగి రాలేం క‌దా. అందుకే ముందుకు వెల్లాం. అంద‌రం ఒక ఫ్యామిలీలా మార‌టంతో సినిమా ఎప్పుడూ బ‌రువుగా అనిపించ‌లేదు. షూటింగ్ చివ‌రి రోజున హ‌మ్మ‌య్యా.. అయిపోయింద‌ని అనుకున్నాం కానీ.. ప‌నుల‌న్నీ పూర్తి అయ్యాక మాత్రం బాధ‌గా ఉంది. అంద‌రం మ‌రికొన్ని రోజులుక‌లిసి ఉంటే బాగుండేద‌నిపిస్తోంది.

= ఈ సినిమాను ఇలా పూర్తి చేశానంటే దానికి కార‌ణం ముగ్గురే ముగ్గురు. ఒక‌రు నిర్మాత‌.. రెండోవారు మా కుటుంబ స‌భ్యులు.. మూడో వ్య‌క్తి ప్ర‌భాస్‌. వీరి వ‌ల్లేచేయ‌గ‌లిగా. లేకుంటే ఏమైపోయేవాడినో..?

= బాహుబ‌లి అంద‌రిని ఆక‌ట్టుకోవ‌టానికి కార‌ణం.. పాత్ర‌ల్లోని బ‌లం. సినిమా చూస్తున్నంత‌సేపు పాత్ర‌ల్ని అస్వాదిస్తుంటే అది క‌చ్ఛితంగా మంచి సినిమా అవుతుంద‌న‌టంలో సందేహం లేదు. ప్ర‌తి పాత్ర‌నీ.. వాటి తాలూకు న‌డ‌వ‌డిక‌.. భావోద్వేగాల్ని సిద్దం చేస్తుంటాం. పాత్ర‌ల్ని చెప్పాక వాటి మ‌ధ్య బంధం ఎలా ఉండాలో త‌ర‌చూ మాట్లాడుకుంటుంటాం. అదో కార‌ణం. భారీద‌నం.. విజువ‌ల్స్‌.. యాక్ష‌న్స్ ఇలా అన్నీ అంశాలు క‌లిసి వ‌చ్చాయ్‌.

- రెండు భాగాల మ‌ధ్య రెండేళ్ల గ్యాప్ వ‌స్తుంద‌ని అస్స‌లు అనుకోలేదు. మొద‌టి భాగం పూర్తి అయిన వెంట‌నే రెండో భాగాన్ని విడుద‌ల చేద్దామ‌ని అనుకున్నాం. మొద‌టి భాగానికే డ‌బ్బుల‌న్నీ అయిపోయాయి. దాంతో రెండో భాగం ఆల‌స్య‌మైంది. మార్కెటింగ్ వ్యూహం అనుకున్నారుకానీ నిజానికి మేమేం ప్లాన్ చేసుకోలేదు.

= బాహుబ‌లికి ముందు సినిమా వ‌సూళ్లు రూ.80 కోట్ల‌కు అటూఇటూగా ఉండేవి. కాస్త తోస్తే రూ.100కోట్ల వ‌ర‌కూ వ‌చ్చే వీలుంద‌నిపించింది. కానీ.. బాహుబ‌లి బ‌డ్జెట్ అంత‌కంటేఎక్కువ‌. అందుకే ఇత‌ర భాష‌ల మీద దృష్టి పెట్టాం. త‌మిళంలోఈగ బాగా ఆడింది. అందుకే.. బాహుబ‌లికి త‌మిళంలో ఎంతో కొంత వ‌స్తుంద‌ని అనుకున్నాం. కానీ.. దాన్ని క‌లిపినా మా బ‌డ్జెట్‌ను తిరిగి రాబ‌ట్టుకోలేమ‌ని అర్థ‌మైంది. అందుకే హిందీ మీద దృష్టి పెట్టాం. కానీ.. జ‌నాల్ని థియేట‌ర్ల‌కు రాబ‌ట్ట‌టం ఎలా అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానంగా క‌ర‌ణ్ జోహార్ ను క‌లిశాం. అలా బ‌డ్జెట్‌ను పెంచుకోగ‌లిగాం. బాహుబ‌లి ఫ‌స్ట్ పార్ట్ కి ఎంత రావొచ్చ‌ని ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్ సీఈవోను అడిగితే.. రోబోకి రూ.18 కోట్లు వ‌చ్చాయి.. కాస్త అటూఇటూగా రూ.20 కోట్లు రావొచ్చ‌న్నారు. కానీ.. రూ.100 కోట్లు వ‌స్తాయ‌ని మ‌న‌మే కాదు.. వాళ్లూ ఊహించ‌లేదు.

= ద‌క్షిణాది చిత్రాలంటే ఉత్త‌రాది వారికి చిన్న చూపు అన్న మాట‌లో నిజం లేదు. క‌థ బాగుంటే ఎవ‌రైనా ఆద‌ర‌ణిస్తారు. ఈగ హిందీలో ఆడ‌లేదు కాబ‌ట్టి.. అక్క‌డ విడుద‌ల చేయ‌క‌పోతే ఈ స్థాయి వ‌సూళ్లు ద‌క్కేవి కావు. బాహుబ‌లి 2లో ట్విస్ట్ లు ఏమీ లేవు. క్లైమాక్స్ ను ముగించేశాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/