Begin typing your search above and press return to search.

నాని సినిమాలో రాజ‌మౌళి

By:  Tupaki Desk   |   4 May 2016 5:29 AM GMT
నాని సినిమాలో రాజ‌మౌళి
X
రాజ‌మౌళి సినిమాలో నాని అంటే... మ‌రో ఈగ సినిమాని ఊహించుకోవ‌చ్చు కానీ ఇక్క‌డేంటి మీరు రివ‌ర్స్‌ గా చెబుతున్నారంటారా? కానీ ఇది నిజం. మ‌న ద‌ర్శ‌కులు కామియో పాత్ర‌ల్లో తెర‌పై త‌ళుక్కున మెర‌వ‌డం కొత్తేమీ కాదు. రాజ‌మౌళి కూడా ఇదివ‌ర‌కు కొన్ని చిత్రాల్లో అతిథిగా క‌నిపించి ప్రేక్ష‌కుల్ని అల‌రించాడు.

అంతెందుకు మొన్న‌టికి మొన్న బాహుబ‌లిలోనూ ఆయ‌న ఓ పాట‌లో క‌నిపించాడు. తాజాగా అలా మ‌రో సినిమాలో న‌టించేందుకు ప‌చ్చ‌జెండా ఊపినట్టు తెలిసింది. ఈసారి త‌న నిజ జీవిత పాత్ర‌లోనే క‌నిపిస్తాడ‌ట‌. ఆయ‌న న‌టించ‌బోయేది నాని సినిమాలో. నాని క‌థానాయ‌కుడిగా ఉయ్యాలా జంపాలా ఫేమ్ విరించి వ‌ర్మ ఓ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్నాడు. అందులో నాని అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌ గా క‌నిపిస్తాడ‌ట‌. అది కూడా నాని నిజ జీవిత పాత్రే. క‌థానాయ‌కుడు కాక మునుపు నాని అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌ గానే ప‌నిచేశారు. బాపుతోపాటు ప‌లువురు ద‌ర్శ‌కుల ద‌గ్గ‌ర శిష్య‌రికం చేసిన ఆయ‌న అనుకోకుండా అష్టాచెమ్మాతో క‌థానాయ‌కుడ‌య్యాడు.

ఇప్పుడు మ‌ళ్లీ ఒక‌ప్ప‌టి త‌న జీవితాన్ని గుర్తు తెచ్చుకొంటూ న‌టించ‌బోతున్నాడన్న‌మాట‌. రాజ‌మౌళి డైరెక్ట‌ర్ పాత్ర‌లో, నాని అసిస్టెంట్ డైరెక్ట‌ర్ పాత్ర‌ల్లో న‌టిస్తున్నారంటే రాజ‌మౌళి శిష్యుడిగానే నాని తెర‌పై ద‌ర్శ‌న‌మిస్తాడ‌ని అర్థ‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం జెంటిల్‌ మ‌న్ చిత్రంలో న‌టిస్తున్న నాని రేపోమాపో కొత్త చిత్రం కోసం రంగంలోకి దిగ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. ఉయ్యాలాజంపాలా లాంటి హిట్టు త‌ర్వాత విరించి వ‌ర్మ మ‌రో సినిమా చేయ‌లేదు. చాలా రోజులు గ్యాప్ తీసుకొని వ‌స్తున్నాడంటే క‌థ‌ - క‌థ‌నాలు మ‌రింత ప‌క్కాగా వుంటాయ‌ని ఊహించుకోవ‌చ్చు. ఆ సినిమాపై ఇండ‌స్ట్రీలో అప్పుడే అంచ‌నాలు మొద‌ల‌య్యాయి.