ఒక రోజు ముందే దీపావళి ధమాకా

Thu Oct 12 2017 16:45:59 GMT+0530 (IST)

కొంచెం గ్యాప్ తర్వాత తెలుగు సినిమాల సందడి మళ్లీ మొదలవుతోంది. దసరా సీజన్ తర్వాత దీపావళి ధమాకా ఆరంభం కాబోతోంది. ఈ శుక్రవారం అక్కినేని నాగార్జున-సమంతల హార్రర్ కామెడీ ‘రాజు గారి గది-2’ విడుదలవుతున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు ‘గల్ఫ్’ అనే చిన్న సినిమా కూడా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఆ తర్వాతి వారానికి రెండు క్రేజున్న సినిమాలు రిలీజవుతున్నాయి. అవే.. రాజా ది గ్రేట్ అదిరింది. ఈ రెండు సినిమాలను ముందు దీపావళి రోజైన అక్టోబరు 19న రిలీజ్ చేయాలనుకున్నారు. ఐతే ఇప్పుడు ఆలోచన మారింది. రెంటినీ ఒక రోజు ముందే.. అంటే 18న విడుదల చేయబోతున్నారు.18న నరక చతుర్దశి కూడా కూడా సెలవే కావడంతో లాంగ్ వీకెండ్ అడ్వాంటేజీ కోసమని.. బుధవారమే ఈ సినిమాల్ని రిలీజ్ చేసేస్తున్నారు. రవితేజ నుంచి దాదాపు రెండేళ్ల విరామం తర్వాత రాబోతున్న ‘రాజా ది గ్రేట్’ మీద అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమా మీద దిల్ రాజు సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మరోవైపు ‘అదిరింది’ డబ్బింగ్ సినిమానే అయినప్పటికీ దాన్ని కూడా భారీగానే విడుదల చేయబోతున్నారు. పవన్ మిత్రుడు శరత్ మరార్ ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తుండటం విశేషం. పైగా ఈ చిత్రాన్ని తమిళంలో నిర్మించిన తెండ్రాల్ ఫిలిమ్స్ కు ఇది వందో సినిమా. దీంతో తెలుగులో విడుదలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఇక్కడ కూడా ప్రమోషన్ భారీగా చేస్తోంది. విజయ్-సమంత-కాజల్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అట్లీ రూపొందించాడు.