Begin typing your search above and press return to search.

ఎంత పని చేశావ్ రాజా?

By:  Tupaki Desk   |   22 Oct 2017 7:37 AM GMT
ఎంత పని చేశావ్ రాజా?
X
అప్పట్లో అక్కినేని నాగార్జున-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘శివమణి’ సినిమాలో పోలీస్ అయిన హీరో ఏ సమస్య వచ్చినా తనకు ఫోన్ చేయమంటూ ఒక ఫోన్ నంబర్ ఇస్తాడు. ఐతే తర్వాత అతను ఆ నంబర్ వాడడు. ఆ నంబరే ఎమ్మెస్ నారాయణ తీసుకుంటాడు. అతడికి శివమణి ఫ్యాన్స్ అదే పనిగా ఫోన్ చేసి విసిగించేస్తారు. అతను వెర్రెత్తిపోతాడు. ఇప్పుడు ‘రాజా ది గ్రేట్’ సినిమా పుణ్యమా అని ఓ వ్యక్తి ఇలాగే ఇబ్బంది పడుతున్నాడు. ఈ సినిమాలో ఒక చోట హీరో తల్లి రాధిక విలన్ కు తన కొడుకు ఫోన్ నంబర్ చెబుతుంది. ఇప్పుడా నంబర్ బయట ప్రచారంలోకి వెళ్లిపోయింది. అది రవితేజ ఒరిజినల్ నంబరే అనుకుని జనాలు అదే పనిగా కాల్స్ చేస్తున్నారట.

విశాఖపట్నం జిల్లా ఆనందపురం ప్రాంతానికి చెందిన గోపి అనే వ్యక్తి నంబరట అది. అతడికి రవితేజ ఫ్యాన్స్ అదే పనిగా ఫోన్ చేసి విసిగిస్తున్నారట. ‘రాజా ది గ్రేట్’ సక్సెస్ అయినందుకు కంగ్రాట్స్ అంటూ కాల్స్ చేసి చెబుతున్నారట. మెసేజులు కూడా పెడుతున్నారట. ఈ తాకిడి తట్టుకోలేక అతను ఫోన్ స్విచాఫ్ చేసి పెట్టేయాల్సిన పరిస్థితి వచ్చేసిందట. సినిమా జనాలపై ఎంత ప్రభావం చూపిస్తుందో చెప్పడానికి ఇది ఉదాహరణ. కాబట్టి ఫిలిం మేకర్స్ ఇలా సినిమాల్లో ఫోన్ నంబర్లు ప్రస్తావించేటపుడు జాగ్రత్తగా ఉండాల్సిందే. దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి రూపొందించిన ‘రాజా ది గ్రేట్’ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. దీపావళి వీకెండ్లో ఈ సినిమా ఓ మోస్తరు వసూళ్లతో సాగిపోతోంది.