సంజయ్ దత్ ఆ వేషాలన్నీ చూపిస్తారట

Sun Jun 24 2018 12:46:03 GMT+0530 (IST)

మున్నాభాయ్ ఎంబీబీఎస్.. మున్నాభాయ్ లగేరహో.. 3 ఇడియట్స్.. పీకే.. ఇవీ రాజ్ కుమార్ హిరాని ఇప్పటిదాకా తీసిన సినిమాలు. వీటిలో దేనికదే క్లాసిక్. అన్నీ గొప్ప సినిమాలుగా పేరు తెచ్చుకున్నవే. హిరాని చాలా నిజాయితీగా తీసిన ఈ సినిమాలు ప్రేక్షకులకు వినోదం పంచడం మాత్రమే కాదు.. వారిలో ఆలోచన రేకెత్తించాయి. జీవిత పాఠాలు బోధించాయి. అలాంటి సినిమాలు అందించిన దర్శకుడు.. తన మిత్రుడైన సంజయ్ దత్ జీవిత కథతో సినిమా తీయబోతున్నానని ప్రకటించగానే అందరిలోనూ ఆశ్చర్యం. సంజు గురించి జనాలకు చెప్పడానికి ఏముంటుంది.. తన మిత్రుడు కాబట్టి అతడిని గొప్పవాడిగా చిత్రీకరిస్తాడేమో.. తద్వారా జనాల్లో తనకున్న పేరును పోగొట్టుకుంటాడేమో అన్న సందేహాలు కలిగాయి. కానీ ‘సంజు’ టీజర్.. ట్రైలర్ చూస్తే మాత్రం ఆ సందేహాలు ఎగిరిపోయాయి.సంజయ్ దత్ జీవితాన్ని కూడా నిజాయితీగానే హిరాని తెరకెక్కించినట్లుగా కనిపిస్తోంది. అతడిలోని మంచితో పాటు చెడును కూడా ఉన్నదున్నట్లుగానే చూపించే ప్రయత్నం చేసినట్లున్నాడు హిరాని. ఈ చిత్ర ప్రమోషన్లలో కూడా హిరాని ఈ విషయాన్ని నొక్కి వక్కాణించాడు. తాను ఒక దర్శకుడిగానే ‘సంజు’ సినిమా తీశానని.. సంజయ్ దత్ మిత్రుడిగా కాదని అన్నాడు. అతడి జీవితంలోని ప్రతికూల కోణాలన్నింటినీ తాను సినిమాలో చూపించానన్నాడు. సంజయ్ దత్ జైలు జీవితం గురించే కాక సినీ రంగంలో అతడి ఎఫైర్లను కూడా తెరకెక్కించానని ఓపెన్‌గా చెప్పాడు. సంజుకు చాలామంది హీరోయిన్లతో ఎఫైర్లున్నాయని.. అతనొక స్త్రీలోలుడని సంకేతాలిచ్చాడు హిరాని. సినిమాలో అతడి వేషాలన్నీ కనిపిస్తాయని ఆయన వెల్లడించాడు. హిరాని ఇలా చెప్పడంతో సినిమాపై మరింత క్యూరియాసిటీ పెరుగుతోంది. సంజయ్ అమితంగా ప్రేమించిన మాధురీ దీక్షిత్ పాత్ర కూడా సినిమాలో ఉండబోతోంది. ఆ పాత్రలో అనుష్క శర్మ నటించడం విశేషం.