Begin typing your search above and press return to search.

బ్లాక్ బస్టర్ వదులుకుని 'కళ్యాణం' చేస్తే..

By:  Tupaki Desk   |   16 Aug 2018 4:47 PM GMT
బ్లాక్ బస్టర్ వదులుకుని కళ్యాణం చేస్తే..
X
ఒకే సమయంలో రెండు సినిమాల అవకాశాలొచ్చి.. అందులో ఒకటి మాత్రమే ఎంచుకోవాల్సి వచ్చినపుడు పెద్ద సందిగ్ధతే ఎదురవుతుంది. ఎంచుకున్న సినిమా ఆడి.. నో చెప్పిన సినిమా ఆడకపోతే హ్యాపీ. కానీ ఫలితం రివర్స్ అయితే మాత్రం చాలా చింతించాల్సి వస్తుంది. అందులోనూ హీరోయిన్ల కెరీర్ సినిమా సినిమాకూ మారిపోయే నేపథ్యంలో జాగ్రత్తగా అడుగులు వేయాల్సిందే. కానీ యంగ్ హీరోయిన్ రాశి ఖన్నా ఈ విషయంలో వేసిన తప్పటడుగు ఆమె కెరీర్‌ కు ఇబ్బందిగా మారింది. టాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘గీత గోవిందం’ కోసం ముందు దర్శకుడు పరశురామ్ చాలామంది హీరోయిన్లను ట్రై చేసి చివరికి రష్మిక మందానాకు ఫిక్సయినట్లు వెల్లడైన సంగతి తెలిసిందే. ముందు లావణ్య త్రిపాఠిని ఈ చిత్రానికి ఎంచుకుని ఆమెతో కొన్ని సన్నివేశాలు కూడా తీశారట. కానీ ఆమె ఈ చిత్రానికి సూటవదని పంపించేశారు.

ఆ తర్వాత లైన్లోకి వచ్చిన రాశి పేరేనట. ఆమెకు స్క్రిప్టు కూడా నచ్చిందట. కానీ రాశి ఏకంగా కోటి రూపాయల పారితోషకం డిమాండ్ చేయడంతో ఆమెకు టాటా చెప్పేశారట నిర్మాత అల్లు అరవింద్. హీరోయిన్‌ కు బాగా ప్రాధాన్యమున్న ఇలాంటి పాత్ర చేస్తే రాశి కెరీర్ కు బాగా ఉపయోగపడేది. ‘తొలి ప్రేమ’తో గొప్ప పేరు సంపాదించిన రాశి.. దాని తర్వాత ‘గీత గోవిందం’తో పలకరించి ఉంటే ఆమె కెరీర్ మరోలా ఉండేదే. కానీ ‘గీత గోవిందం’ వద్దనుకుని ‘శ్రీనివాస కళ్యాణం’లో నటించింది రాశి. ఆ చిత్రానికి కూడా రెమ్యూనరేషన్ లో ఆమె ఎక్కడా తగ్గలేదని స్వయంగా రాజు చెప్పాడు. కానీ ఈ చిత్ర ఫలితం ఏమైందో తెలిసిందే. అటు హిట్ మిస్సయితే.. ఇటు ఫ్లాప్ పడింది. ఇప్పుడు రాశి ఎంత బాధ పడుతూ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పేదేముంది? ‘గీత గోవిందం’తో రష్మికకు చాలా మంచి పేరే వస్తోంది. ఈ సినిమాతో ఆమె స్టార్ హీరోయిన్ల లీగ్ లోకి చేరిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.